చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
Breaking News
వొడాఫోన్‌కు 2023 కీలక సంవత్సరం కానుంది!
Published on Wed, 01/11/2023 - 11:31
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా లేదా అనే కోణంలో వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ఇది నిర్ణయాత్మకమైన ఏడాదిగా ఉండనుందని తెలిపింది. అలాగే డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు ఆధారిత ఆదాయ వృద్ధి .. పరిశ్రమకు కీలకంగా ఉంటుందని ఒక నివేదికలో సీఎల్‌ఎస్‌ఏ వివరించింది. దీని ప్రకారం 2023లో దేశీ మొబైల్ మార్కెట్లో 5జీ సేవల విస్తరణ, టారిఫ్‌ల పెంపు, రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ మొదలైనవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి.
ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అనుమతించిన పక్షంలో వ్యాపార సంస్థలకు ఇచ్చే 5జీ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చే ఆదాయాలకు కొంత గండి పడే అవకాశం ఉంది. 2022లో 14 శాతం పెరిగిన దేశీ మొబైల్ రంగం ఆదాయం 2023లో కూడా దాదాపు అదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. టారిఫ్‌ల పెంపు, డేటా వినియోగం పెరుగుదల ఇందుకు తోడ్పడనున్నాయి. టారిఫ్‌లను పెంచే విషయంలో భారతి ఎయిర్‌టెల్ అన్నింటికన్నా ముందు ఉండవచ్చని.. వీఐఎల్, రిలయన్స్ జియో దాన్ని అనుసరించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ నివేదిక పేర్కొంది.
నిధుల సమీకరణలోను, బకాయిలకు బదులు కేంద్రానికి వాటాలు ఇచ్చే ప్రతిపాదనల అమల్లో జాప్యాల కారణంగా వీఐఎల్ ఆర్థిక సంక్షోభం అవకాశాలు పూర్తిగా సమసిపోలేదని తెలిపింది. వీఐఎల్ మార్కెట్ వాటా తగ్గుతూ జియో, ఎయిర్‌టెల్ మార్కెట్ పెరగడం కొనసాగవచ్చని సీఎల్‌ఎస్‌ఏ వివరించింది. మొత్తం మీద యూజర్లపై వచ్చే సగటు ఆదాయం, డేటా వినియోగం పెరగడం ద్వారా టెలికం పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రూ. 2,84,600 కోట్లకు చేరవచ్చని తెలిపింది.
చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
Tags : 1