Breaking News

మళ్లీ మనకి రష్యా క్రూడ్‌

Published on Sat, 03/07/2026 - 01:10

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్‌ కొనుగోలు చేసేందుకు భారత్‌కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్‌కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.

‘‘అధ్యక్షుడు ట్రంప్‌ ఎజెండాతో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్‌ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్‌ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్‌ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్‌ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్‌ తెలిపారు.  

సముద్ర జలాల్లో 130 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌
ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్‌ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం 15 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడ్‌తో అరేబియన్‌ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్‌ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్‌ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్‌ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్‌కి చేరుకునేంత దూరంలో, సింగపూర్‌ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్‌కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్‌ కెనాల్‌లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.  

దాదాపు 50 శాతం క్రూడ్‌ దిగుమతుల కోసం హార్మూజ్‌ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్‌కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ’కెప్లర్‌’ అనలిస్ట్‌ సుమీత్‌ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్‌ బ్యారెళ్ల రష్యన్‌ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్‌ బ్యారెళ్ల రష్యన్‌ ఆయిల్‌ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్‌ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్‌కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు.  

25 రోజులకు సరిపడా నిల్వలు...
ఉక్రెయిన్‌ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్‌కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్‌ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్‌ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్‌ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్‌ ఆయిల్‌ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్‌ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్‌ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు.

Videos

ఇరాన్ లో భూకంపం

విజయవాడలో షాకింగ్ ఘటన.. పోలీసులపై దుండగుడి కాల్పులు..?

నాకు ప్రాణహాని ఉంది.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

యుద్ధ ప్రభావం ఉన్నా గోల్డ్, సిల్వర్ రేట్ పడిపోవడానికి కారణం ఏమిటి..?

అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు.. మంత్రి సవితకు అంగన్వాడీ వర్కర్స్ కౌంటర్

బస్సులో బ్రష్.. కండక్టర్ పై సీరియస్

కుల, మతాలు అంటూ.. పవన్ కొత్త రాజకీయం

స్కూల్ దగ్గర బాంబు దాడి.. విద్యార్థులు పరుగులు

వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ కు గుడ్ న్యూస్

పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)