Breaking News

సముద్రంపై AI సామ్రాజ్యం! శామ్‌సంగ్ కొత్త ప్రయోగం

Published on Sun, 06/14/2026 - 12:36

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

మూడు సంస్థలు కలిసి..

తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్‌ క్లీన్‌ ఎనర్జీ క్యారియర్స్‌, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్‌ రెజిస్టర్‌ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్‌లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్‌సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.

డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?

భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.

50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లు

శామ్‌సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

సర్వర్లకు సముద్రం సవాలే!

అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్‌వేర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్‌మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలు

ఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.

మరిన్ని సముద్ర డేటా సెంటర్లు

ఈ రంగంలో శామ్‌సంగ్ ఒక్కటే కాదు. జపాన్‌కు చెందిన మిత్సుయి ఒ.ఎస్‌.కె. లైన్స్‌ (MOL), టర్కీకి చెందిన కర్పవర్‌షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్‌ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్‌ డేటా టెక్నాలజీస్‌ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)