నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
అప్పు.. అప్పుతోనే చెల్లు! ఇదే ‘రిచ్ డాడ్’ సీక్రెట్!!
Published on Sun, 09/20/2026 - 13:12
అప్పుల నుంచి బయటపడాలంటే సాధారణంగా వాటిని వీలైనంత త్వరగా తీర్చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెడ్డ అప్పులను (Bad Debt) తీర్చేందుకు సొంత డబ్బును ఉపయోగించకుండా.. ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తుల కోసం ‘మంచి అప్పు’ (Good Debt) తీసుకుని, ఆ ఆదాయంతో పాత అప్పులను తీర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టులో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కియోసాకి ప్రకారం.. క్రెడిట్ కార్డు వంటి అధిక వడ్డీ అప్పులను జీతంతో నెలనెలా తీర్చుకుంటూ 20 ఏళ్ల పాటు కొనసాగడం కంటే, నగదు ప్రవాహం (Cash Flow) అందించే ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణాన్ని ఉపయోగించుకోవడం ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలను చెల్లిస్తూ, మిగిలిన మొత్తాన్ని చెడ్డ అప్పులను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.
తన భార్య కిమ్ మొదటిసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన ఉదాహరణను ఈ సందర్భంగా కియోసాకి ప్రస్తావించారు. ఆమె 5,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టి, మరో 40,000 డాలర్లను రుణంగా తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ రుణాన్ని ఆమె సొంత డబ్బుతో చెల్లించలేదని, ఆ ప్రాపర్టీలోని అద్దెదారుల నుంచి వచ్చిన అద్దె ఆదాయమే రుణ చెల్లింపులకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. అద్దె ఆదాయం మార్ట్గేజ్ చెల్లింపులను కవర్ చేయడంతో పాటు కొంత మిగిలేదని వివరించారు.
తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని వివరించేందుకు కియోసాకి మోనోపొలీ గేమ్‌ను కూడా ఉదాహరణగా తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌ను రుణంతో కొనుగోలు చేసే విధానాన్ని అర్థం చేసుకునేలా ఈ ఆట ద్వారా నేర్పించారని చెప్పారు. ఒక ప్రాపర్టీపై అద్దె చెల్లించినప్పుడు, ఆ డబ్బులో కొంత భాగం బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు వెళ్లేలా ఉండేదని వివరించారు.
ఇదీ చదవండి: ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి
అందువల్ల ఆదాయం తీసుకువచ్చే ఆస్తుల ద్వారా వచ్చే నగదు ప్రవాహాన్ని ఉపయోగించి రుణాన్ని చెల్లించడమే తన ఉద్దేశమని కియోసాకి చెప్పారు. జీతంతో మాత్రమే అప్పులను తీర్చేందుకు శ్రమించే బదులు.. ఇతరుల నుంచి వచ్చే నగదు ప్రవాహం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
అయితే రుణంతో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వడ్డీ భారం, ఆస్తి విలువ తగ్గడం, అద్దె ఆదాయం రాకపోవడం వంటి ఆర్థిక నష్టాలు కూడా ఉండొచ్చన్న విషయాన్ని కియోసాకి ఈ పోస్టులో ప్రస్తావించలేదు.
Tags : 1