Breaking News

జగన్‌ వెంట జన సాగరం

Published on Fri, 07/31/2026 - 05:05

సాక్షి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, అరసవల్లి: అడుగడుగునా ఖాకీలను మోహరించి చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకున్నా లెక్క చేయకుండా జన సముద్రం పోటెత్తింది! పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖ నుంచి సిక్కోలు దాకా జనవాహిని ఉప్పొంగింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. 

అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు పట్టిందంటే జనం తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పర్యటన ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం జంక్షన్, అడవివరం, సత్తరువు జంక్షన్, నీలకుండీలు, ఆనందపురం జంక్షన్, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలోనే సుమారు మూడు గంటల పాటు సాగింది. 

దారి పొడవునా శ్రీకాకుళం దాకా ఎటు చూసినా జనమే. కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వకుండా జన ప్రవాహం కొనసాగింది. మధ్యాహ్నం 1:35 గంటలకు కాన్వాయ్‌ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్‌ జగన్‌ పర్యటనలో యువత, మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని గదమాయించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఖాకీలు ఎంతగా అడ్డుకున్నా జన ప్రవాహాన్ని నిరోధించలేక చివరకు చేతులెత్తేశారు. 

వెల్లువెత్తిన వినతులు 
విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్‌పోర్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాకాణి నగర్‌ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిశీకులు వైఎస్‌ జగన్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్‌ (భీమిలి) వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం జంక్షన్‌ వద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం కోసం తమ వద్ద నుంచి సేకరించిన డీ–పట్టా భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ రైతులు వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 

పోటెత్తిన మత్స్యకారులు...: మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, కోష్ట తదితర తీర ప్రాంతాల నుంచి వందలాది మత్స్యకార కుటుంబాలు జగన్‌ పర్యటనలో పోటెత్తాయి. అంపోలు ప్రాంతానికి గార, శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి అప్పలరాజుకు మద్దతుగా జగనన్నను కలిసి తమ ఆవేదన తెలియచేశారు.  


పోలీసుల ఆంక్షలు.. కాలి నడకన నేతలు 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన పొడవునా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నిరోధించేందుకు యత్నించినా అభిమానం ముందు ఆ ఆంక్షలు నిలవలేదు. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, నాయకులు నేతలు కాలినడకనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంబోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్‌ చేశారు. 

రెండు వేల మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవునా, ప్రతి గ్రామ శివారులో కాపలా పెట్టారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్తరోడ్డు, పెదపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. జగన్‌ వెంటే సాగారు. వైఎస్‌ జగన్‌ వారిని నిరాశ పరచకుండా అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతించారు. 

ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్‌ వర్మ, అర్నవ్‌ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.  

అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలను సైతం అడ్డుకుని..
నలుమూలల నుంచి తరలి వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు కీలక నేతల కార్లను గురువారం ఉదయం నుంచి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణించేందుకు సైతం నిరాకరించారు. కొత్తరోడ్డులో అంతిమయాత్ర వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం నరేంద్రపురం వద్ద మహిళలను ఆస్పత్రులకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. రాగోలు వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు.

ఎచ్చెర్ల రోడ్డు నవభారత్‌ జంక్షన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంట స్థానిక నేతల వాహనాలు వెళ్లకుండా జాతీయ రహదారిని గంట సేపు దిగ్భందించారు. అంపోలు కూడలిలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్‌ వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు ఉన్నారు. వీరంతా జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)