Breaking News

‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!

Published on Mon, 04/07/2025 - 04:21

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. 

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం.  

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. 

మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబు­తున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.  


ఆరోగ్య ప్రదాత..
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. 



నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. 

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.     
 

బకాయిలు చెల్లించి భరోసా 
2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. 

రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్‌లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది.     

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)