Breaking News

లాకప్‌డెత్‌తో సర్కారు ఉక్కిరిబిక్కిరి

Published on Thu, 06/18/2026 - 03:41

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 

నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్‌ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్‌డెత్‌ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్‌ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్‌ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

తెలివిగా తప్పుకున్న చంద్రబాబు 
ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్‌కళ్యాణ్‌ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్‌ కళ్యాణ్‌కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. 

మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్‌ కళ్యాణ్‌కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్‌ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి.  

జనసేనలో కలకలం
‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్‌చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్‌డెత్‌ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్‌ మీట్‌ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్‌ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.

ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులు
సాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్‌లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్‌ డీల్‌ కుదుర్చుకున్న పవన్‌ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఇప్పుడేం చేద్దాం?
సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలు
ఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చ
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్‌ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్‌తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ మహేష్‌ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్‌ కమిషనర్‌ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. 

ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్‌కు పంపామని చెప్పగా, సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. 

ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. 

మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)