Breaking News

ఐదువందల ఏళ్ల ప్రేతాత్మకు కార్తీకమాసంలో విముక్తి...

Published on Sun, 11/29/2026 - 08:59

సహ్యాద్రి ప్రాంతంలో కరవీరపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ధర్మదత్తుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు అనుదినం నిత్య నైమిత్తిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. నిరంతరం ద్వాదశాక్షరీ మంత్రం జపిస్తూ, హరిభక్తి పరాయణుడై ఉండేవాడు.

ఒకసారి కార్తీకమాసంలో విష్ణుజాగరణ చేయాలని ధర్మదత్తుడు సంకల్పించుకున్నాడు. వేకువజామునే పూజోపకరణాలను సమకూర్చుకుని, విష్ణ్వాలయానికి బయలుదేరాడు. ఇంకా సూర్యోదయం కానందున దారి అంతా చీకటిగా ఉంది. కొంత దూరం నడిచాక దారిలో అస్థిపంజరంలాంటి శరీరంతో ఎర్రటి కళ్లు, వికృతమైన నోరు గల బ్రహ్మరాక్షసి తారసపడింది. ఆ రాక్షసి పందిలా ఘుర్ఘరిస్తోంది. ఆమెను చూడగానే ధర్మదత్తుడు భయంతో వణికిపోయాడు. హరినామాన్ని జపిస్తూ, తన ఉద్ధరిణిలోని తులసిజలాన్ని తీసి బయటకు చల్లాడు. ఆ తులసిజలంలోని కొన్ని బిందువులు బ్రహ్మరాక్షసి శరీరంపై పడ్డాయి.

తులసిజలం సోకగానే ఆమె భయంకరాకారం పోయి, సుందరరూపం వచ్చింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి కూడా కలిగింది. ఆమె వెంటనే ధర్మదత్తుడి పాదాలపై పడింది. ‘మహానుభావా! హరినామ స్మరణతో నువ్వు చిలకరించిన తులసిజలం తాకడంతోనే నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పుణ్యాత్ముడవైన నీ కరుణ వల్ల నేను ధన్యురాలినయ్యాను’ అని పలికింది.

‘తల్లీ! నువ్వెవరివి? నీకు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది?’ అడిగాడు ధర్మదత్తుడు.
‘విప్రోత్తమా! పూర్వజన్మలో నేను సౌరాష్ట్రంలో భిక్షుడు అనే బ్రాహ్మణుడికి భార్యను. నా పేరు కలహ. చాలా కఠినాత్మురాలిగా ఉంటూ నా భర్తను నానా విధాలుగా వేధించేదాన్ని. ఏనాడూ భర్త ఆజ్ఞను పాటించేదాన్ని కాదు. నిత్యం అతడితో జగడాలు పెట్టుకుంటూ అతడికి మనశ్శాంతి లేకుండా చేసేదాన్ని. నా దాష్టీకాలను నా భర్త భరించలేకపోయాడు. నన్ను విడిచిపెట్టి, మారుమనువు చేసుకుందామని అనుకున్నాడు. అతడు మారుమనువు కోసం ప్రయత్నాలు సాగించడాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఆవేశంతో విషంతాగి మరణించాను.

యమదూతలు నన్ను తీసుకుపోయి, యముడి ఎదుట నిలబెట్టారు. యమధర్మరాజు నా కర్మల వివరాలను చిత్రగుప్తుడిని అడిగాడు. ‘యమధర్మరాజా! ఈమె ఏనాడూ ఒక్క మంచిపని కూడా చేయలేదు. తాను సుష్టుగా భోజనం చేసినా, భర్తకు వేళకు అన్నం పెట్టేది కాదు. అతడిని నానా రకాలుగా కాల్చుకు తినేది. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందున ఈమె ప్రేతశరీరాన్ని పొందుగాక’ అన్నాడు చిత్రగుప్తుడు.

నాటి నుంచి ఐదువందల ఏళ్లుగా నేను ప్రేతశరీరంతోనే జీవిస్తూ వచ్చాను. ఆకలి దప్పులతో ఆల్లాడుతూ నా పాపాలకు నేను దుఃఖిస్తూ వచ్చాను. ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్ది నువ్వు ఎదురయ్యావు. నువ్వు చల్లిన తులసిజలం నాపై పడటంతో నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. విప్రోత్తమా! నాకు ముక్తి ఎలా కలుగుతుందో నువ్వే చెప్పి అనుగ్రహించాలి’ అని కోరింది.

‘నీకు భయంకరాకారం పోయినా, ఇప్పటికీ నీది ప్రేతశరీరమే! తీర్థయాత్రలు, వ్రతాలు, దాన ధర్మాలు ఆచరించడం వల్ల పాపాలు పూర్తిగా నశించి, మోక్షం కలుగుతుంది. కాని, నువ్వు ప్రేతశరీరంతో ఉన్నందున వాటిని ఆచరించే అధికారం నీకు లేదు. మూడు జన్మలు ఎత్తితే గాని నీ పాపకర్మలు పరిపూర్ణంగా నశించవు. స్వల్పపుణ్యాలతో నీకు మోక్షం దొరకడం దుర్లభం.

నువ్వు పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచరిస్తూ వస్తున్న నా కార్తీకవ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ఇప్పుడే ధారపోస్తాను. దానితో నువ్వు ముక్తిపొందగలవు.’ అని పలికి, తన కార్తీక వ్రతఫలాన్ని ససంకల్పంగా ధారపోశాడు. వెంటనే విష్ణుభటులు దివ్యవిమానంతో ఆమెను తమతో వైకుంఠానికి తీసుకుపోవడానికి అక్కడకు వచ్చి నిలిచారు. ఆ విమానాన్ని చూస్తూనే ధర్మదత్తుడు ఆ విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు.

దివ్యవిమానంలోని ద్వారపాలకులైన సుశీల, పుణ్యశీలులిద్దరూ ధర్మదత్తుడిని లేవనెత్తి, ఆశీర్వదించారు. ‘ఓ హరిభక్తాగ్రేసరా! నువ్వు ధర్మవిదుడవు, అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం ధారవిడువడం వల్ల నీ పుణ్యం రెట్టింపైంది. నువ్వు విష్ణు సాన్నిధ్యంలో వేలాది సంవత్సరాలు భోగాలను అనుభవిస్తావు. వైకుంఠంలో పుణ్యఫలాన్ని పూర్తిగా అనుభవించాక సూర్యవంశంలో దశరథ మహా రాజుగా జన్మిస్తావు’ అని చెప్పి, కలహను తమతో తీసుకుని వైకుంఠానికి వెళ్లిపోయారు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
అసోం రాష్ట్రంలోని గువాహటి నగరానికి పశ్చిమాన జలుక్‌బారి ప్రాంతంలో కొండ శిఖరంపై వెలసిన లంకేశ్వర ఆలయం ఇది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలిపే ఆధారాలేవీ లేవు. స్థలపురాణం ప్రకారం లంకేశ్వరుడైన రావణాసురుడు ఈ కొండ శిఖరంపైనే శివలింగాన్ని ప్రతిష్ఠించి శివార్చన చేసేవాడట!

ఈ ఆలయ శిల్పనిర్మాణ శైలిని పరిశీలించి, వివిధ పరీక్షలు జరిపిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని క్రీస్తుశకం 8–10 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కొండమీదకు దారితీసే 452 పాలరాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శనీశ్వరుడికి, గణేశుడికి ఉపాలయాలు; హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలు ఉన్నాయి. ఏటా కార్తీకమాసంలోను, శివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: 'టీ' తాగుతారా? తింటారా? సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)