ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!
Breaking News
'ఆకాశంలో ఒక తార' మూవీ రివ్యూ అండ్ రేటింగ్...
Published on Fri, 11/20/2026 - 00:40
టైటిల్: 'ఆకాశంలో ఒక తార'
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహాని శర్మ తదితరులు
నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్ల
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
దర్శకత్వం: పవన్ సాధినేని
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
విడుదల తేది: నవంబర్ 20, 2026
భాషతో సంబంధం లేకుండా తన నటనతో సీనీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంతో పాటు తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి చిత్రం టాలీవుడ్‌లోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల ‘ఐమ్ గేమ్’తో ప్రేక్షకులను పలకరించిన దుల్కర్.. ఇప్పుడు ‘ఆకాశంలో ఒకతార’ అంటూ వచ్చాడు. ఆసక్తికరమైన ట్రైలర్‌తో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా.. వెండితెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేసిందా? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? చూద్దాం. (Aakasamlo Oka Tara Telugu Movie Review)

కథేంటంటే?
పాలలంక గ్రామానికి చెందిన కల్పన(సాత్విక వీరవల్లి) చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలని కలలు కంటుంది. కానీ తాగుబోతు అయిన తండ్రి(కోట జయరాం).. పదో తరగతి పూర్తవ్వగానే కృష్ణ(దుల్కర్ సల్మాన్)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మొదటి రాత్రి రోజు కల్పన కోరిక గురించి కృష్ణ తెలుసుకుంటాడు. పదో తరగతిలో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించిన తన భార్యను ఎలాగైనా వ్యోమగామిగా చేయాలని కృష్ణ నిర్ణయించుకుంటాడు.
సొంత అక్కతో పాటు అత్త మామలను ఎదురించి.. భార్యపై చదువుల కోసం హైదరాబాద్ వస్తాడు. కల్పన కష్టపడి చదివి ఐఐటీలో ఏడో ర్యాంకు సాధిస్తుంది. భార్యను కేరళ ఐఐటీ కాలేజీలో చేర్పించి.. డబ్బుల కోసం గుజరాత్ వెళ్లి బొగ్గుగనిలో డ్రైవర్‌గా చేరుతాడు కృష్ణ. అక్కడ డబ్బుల కోసం కష్టపడి పని చేస్తుంటే.. ఇక్కడ కల్పన తన లక్ష్యాన్ని చేరడం కోసం కష్టపడి చదువుతుంది.
కాలేజీలో వచ్చిన అవకాశంతో రాకెట్ స్పెస్‌లో కల్పన ఓ ప్రయోగం చేస్తుంది. అది విఫలం అవ్వడంతో పాటు కల్పనను సస్పెండ్ కూడా అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత కల్పన జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? వ్యోమగామి (ఆస్ట్రోనాట్) కావాలనుకున్న తన భార్య కలను నెరవేర్చడం కోసం కృష్ణ పడిన కష్టాలు ఏంటి? చివరకు కల్పన రాకెట్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్లిందా లేదా? ఈ కథలో రోహిణి (శ్రుతీహాసన్), బిజిలి(రుహానీ శర్మ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...
కొన్ని కథలకు ప్రారంభంలోనే ముగింపు ఏంటనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగుతుంది. అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. అలాంటి అరుదైన కథల్లో ‘ఆకాశంలో ఒకతార’ ఒకటి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమవుతుంది. అయినా రెండున్నర గంటల(159 నిమిషాల నిడివి)పాటు ప్రేక్షకులను కథతో ప్రయాణం చేసేలా చేశాడు దర్శకుడు పవన్ సాధినేని.
అలా అని ఇది కొత్త కథేమి కాదు. ఇదివరకు ఈ తరహా మహిళా సాధికారిక కథలు చాలనే వచ్చాయి. సినిమా చూస్తున్నప్ప సేపు వెంకటేశ్ రాజా, సూర్యవంశంతో పాటు కొన్ని చోట్ల సూర్య నటించిన ఆకాశ వీధుల్లో, సముద్రఖని నటించిన విమానం లాంటి ఎన్నో చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే ఎమోషన్ బలంగా పండడం ఈ సినిమాకు ప్రధాన బలం. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే చాలా సీన్లు భావోధ్వేగానికి గురి చేస్తాయి. అదే సమయంలో కొంత సాగదీతగానూ అనిపిస్తుంది.
కల్పన బాల్యం సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆమె అస్ట్రోనాట్ అవ్వాలని చిన్నప్పుడే కలలు కనడానికి గల కారణం ఏంటో చూపించి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. కృష్ణ పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతవరకు పరుగులు తీస్తుంది. కల్పనతో పెళ్లి.. ఫస్ట్‌నైట్ రోజే ఆమె గోల్ గురించి తెలుసుకోవడం.. భార్య టాలెంట్ చూసి ఎలాగైన అస్ట్రోనాట్ చేయాలని హైదరాబాద్‌కు వెళ్లడం.. ఇదంతా చకచకా జరిగిపోతుంది.
ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. గుజరాత్లో కృష్ణ, బిజిలీల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూనే కొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేస్తుంది. అయితే ద్వితియార్థంలో కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం.. సినిమాటిక్ లివర్టీ ఎక్కువగా తీసుకోవడంతో ఎమోషనల్ సీన్లకు కూడా పెద్దగా కనెక్టు కాలేదు.
అలాగే ఒకటి రెండు చోట్ల అనవసరపు డైలాగులను పెట్టారనిపిస్తుంది. ఇక చివరి 20 నిమిషాలను గుండెను బరువెక్కిస్తాయి. ముందుగా చెప్పినట్లుగా ఈ మూవీ కథనం ఊహకందేలా సాగుతుంది. కానీ కాస్త ఓపికపట్టి.. సాగదీత సీన్లను కూడా భరిస్తే.. ఓ మంచి మూవీ చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు.
ఎవరెలా చేశారంటే..
దుల్కర్ సల్మాన్ నటన గురించి తెలిసిందే. ఇలాంటి అమాయకపు పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. అందుకే కృష్ణ పాత్రలో ఆయన జీవించేశాడు. ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఇక సాత్విక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో తొలి సినిమానే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తెరపై చాలా అందంగా కనిపించింది కూడా.
ఇక శ్రుతీహాసన్ పోషించిన రోహిణి పాత్ర కథకు చాలా కీలకమనే చెప్పాలి. ఆ పాత్రకు శ్రుతీహాసన్ పూర్తి న్యాయం చేసింది. బిజిలీగా రుహానీ శర్మ తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. పాటలు హృదయాలను హత్తుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: నో అరెస్ట్... నో రికార్డ్స్
Tags : 1