నేల, నీరు, అడవులు.. ప్రకృతికి మళ్లీ జీవం పోసే అద్భుత మార్గం!

Published on Fri, 10/30/2026 - 08:36

మన చర్యల (ఉదాహరణకు పారిశ్రామిక రసాయనిక వ్యవసాయం) వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి వనరులు నాశనమవుతుంటాయని మనకు తెలుసు. దెబ్బతిన్న, క్షీణించిన, నాశనమైన ప్రకృతిని తిరిగి పూర్వ స్థితికి లేదా ఆరోగ్యకరమైన జీవన స్థితికి తీసుకురావటాన్నే ‘ప్రకృతి పునరుజ్జీవం’ (ఎకోసిస్టమ్‌ రెస్టోరేషన్‌) అంటాం. మామూలు మాటల్లో చెప్పాలంటే.. నిర్జీవంగా మారిన నేల, నీరు, వృక్ష, జంతుజాలాల సమతుల్యతను తిరిగి పునరుజ్జీవింపజేయటమే ఈ పునరుద్ధరణ.

ఐక్యరాజ్యసమితి ‘ఎకోసిస్టమ్‌ రెస్టోరేషన్‌ దశాబ్దం (2021–2030)’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ), జీవవైవిధ్య సదస్సు (సీబీడీ) సంయుక్తంగా తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేశాయి. యెరెవాన్‌ (ఆర్మేనియా)లో జరిగిన ఐరాస జీవవైవిధ్య సదస్సు (కాప్‌–17) వేదికగా ‘నేచర్స్‌ కమ్‌బ్యాక్‌’ పేరిట ఈ నివేదిక వెలువడింది... ఆ నివేదికలో ఇంకా ఏముందంటే..?

జీవావరణాల పునరుద్ధరణ, వ్యవసాయం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరస్పర పూరకాలు. నేల, నీరు, జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉంటేనే వ్యవసాయం నిలకడగా సాగుతుంది. అదే సమయంలో సరైన వ్యవసాయ పద్ధతులే పర్యావరణాన్ని కాపాడతాయి. మానవాళి మనుగడకు, ఆహార భద్రతకు అత్యంత కీలకమైన జీవావరణాల పునరుద్ధరణ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటోంది.

ఆసియా అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో 25.2 కోట్ల (252 మిలియన్ల) హెక్టార్ల విస్తీర్ణంలో క్షీణించిన నేలలు, ఆవాసాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ చర్యల ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటికే పది లక్షల మందికి పైగా హరిత ఉద్యోగాలు (గ్రీన్‌ జాబ్స్‌) లభించాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్న మొత్తం విస్తీర్ణంలో ఆసియా ఖండం 19.22 కోట్ల హెక్టార్లతో ముందంజలో ఉండగా, ఆఫ్రికా 3.63 కోట్ల హెక్టార్లు, యూరప్‌ 91 లక్షల హెక్టార్లలో పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి. ఒక్క చైనాలోనే 12.74 కోట్ల హెక్టార్ల భూభాగంలో పనులు జరుగుతున్నాయి.

భారత్‌లో గంగా నది డాల్ఫిన్లు, బ్రెజిల్‌లో జాగ్వార్లు, తూర్పు ఆఫ్రికాలో పర్వత గొరిల్లాలు వంటి అంతరించిపోతున్న జీవజాతుల సంఖ్య ‘ప్రకృతి పునరుద్ధరణ’ కార్యక్రమాలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో నిలకడగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.

పర్యావరణానికి మేలు
ప్రపంచంలో క్షీణించిన కీలక ప్రాంతాల్లో కేవలం 15 శాతం భూభాగాన్ని పునరుద్ధరించగలిగినా అపారమైన ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి వెలువడిన కర్బన ఉద్గారాల్లో దాదాపు 30 శాతాన్ని ఈ నేలలు, చెట్లు చేమలు తిరిగి సంగ్రహించి నిల్వ చేయగలవు. భూమ్మీద అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 60 శాతం జీవజాతులను అంతరించిపోకుండా కాపాడవచ్చు.

వేగం పెరగాలి 
అయితే, క్షీణించిన భూమి పునరుద్ధరణ లక్ష్యం సగం లక్ష్యానికి చేరుకున్నప్పటికీ.. మంచినీటి వనరులు, సముద్ర, తీర ప్రాంత ఆవాసాల పునరుద్ధరణ ఇంకా మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 1.1 కోట్ల హెక్టార్ల మంచినీటి ఆవాసాలు, 57 లక్షల హెక్టార్ల సముద్ర, తీర్రపాంత పర్యావరణ వ్యవస్థలు మాత్రమే రక్షణ పరిధిలోకి వచ్చాయి. చిత్తడి నేలల పునరుద్ధరణ కార్యక్రమాలు అమలు చేస్తున్న దేశాల సంఖ్య 2022 నాటి 8 శాతం నుంచి 54 శాతానికి పెరగటం సానుకూల పరిణామం.

వ్యవసాయ అటవీకరణకు పెద్దపీట
2030 నాటికి నిర్దేశించుకున్న ‘కున్మింగ్‌–మాంట్రియల్‌ గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌’ లక్ష్యాలను (30 శాతం క్షీణించిన ఆవాసాల పునరుద్ధరణ) సాధించాలంటే వార్షిక నిధుల కేటాయింపు నాలుగు రెట్లు పెరగాలని నివేదిక స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 6,400 కోట్ల డాలర్లను 2030 నాటికి 29,600 కోట్ల డాలర్లకు పెంచాల్సి ఉంది. ఈ నిధుల్లో అత్యధిక భాగం వ్యవసాయ–అటవీకరణ (ఆగ్రోఫారెస్ట్రీ – సుమారు 8,700 కోట్ల డాలర్లు), అడవుల పెంపకం (5,200 కోట్ల డాలర్లు), పీట్‌ల్యాండ్స్‌ (4,400 కోట్ల డాలర్లు), సముద్రగడ్డి పెంపకం (2,800 కోట్ల డాలర్లు) వంటి రంగాలకు అవసరమవుతాయి. ఈ పెట్టుబడులు సకాలంలో అందితే, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3.2 కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

భూమి ఆరోగ్యం బాగుంటేనే ఆహార భద్రత, పోషకాహార భద్రత సాధ్యమవుతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని ్రపోత్సహించాలి.

ఒకే పొలంలో దీర్ఘకాలిక పండ్ల చెట్లతో పాటు వరుసల మధ్యలో స్వల్పకాలిక పంటలు కలిసి పెరిగే అటవీ వ్యవసాయ (ఆగ్రోఫారెస్ట్రీ) సాగు పద్ధతులను విస్తృతంగా ్రపోత్సహించాల్సిన సమయమిది.

ఇదీ చదవండి: ఏదైనా అదుపులో ఉందాం..

జీవావరణాల పునరుద్ధరణ, వ్యవసాయం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరస్పర పూరకాలు. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాలు:

1. నేల ఆరోగ్యం, సేంద్రియ కర్బనం పునరుద్ధరణ
రసాయనాల మితిమీరిన వాడకం, లోతైన దుక్కుల వల్ల నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు నశించి నేల నిర్జీవమవుతోంది. సహజ పునరుద్ధరణ పద్ధతులు (జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన/మల్చింగ్, పంట మార్పిడి) నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతాయి. సారవంతమైన నేల పంటలకు అవసరమైన పోషకాలను సహజంగానే అందిస్తుంది.

2. భూగర్భ జలాలు, తేమ పరిరక్షణ
క్షీణించిన భూముల్లో చెట్లు, గడ్డి జాతులు పెంచడం, నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. నేలలో సేంద్రియ కర్బనం పెరిగితే అది స్పాంజిలా మారి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది. ఇది వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను కాపాడుతుంది.

3. çసహజ మిత్రపురుగులు
ప్రపంచవ్యాప్తంగా 75 శాతానికి పైగా ఆహార పంటలు తేనెటీగలు, సీతాకోకచిలుకలు, ఇతర కీటకాల పరాగసంపర్కంపైనే ఆధారపడి ఉన్నాయి. గట్ల వెంబడి రకరకాల పూల మొక్కలు, చెట్లను పెంచే జీవావరణ పద్ధతుల వల్ల తేనెటీగలు, శత్రుపురుగులను తినే మిత్రపురుగులు (లేడీబర్డ్‌ బీటిల్స్, సాలీళ్ళు) వృద్ధి చెందుతాయి. దీనివల్ల పురుగుమందుల ఖర్చు లేకుండా సహజ నియంత్రణ సాధ్యమవుతుంది.

4. వ్యవసాయ అటవీకరణ 
పంట పొలాల గట్లపై లేదా పొలంలోనే బహుళార్ధసాధక చెట్లను (పండ్ల చెట్లు, కలప, పశుగ్రాసం ఇచ్చే చెట్లు) పెంచడం జీవావరణ పునరుద్ధరణలో కీలక భాగం. ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా, తీవ్రమైన గాలుల నుంచి పంటలను కాపాడుతుంది, నేల కోతను నివారిస్తుంది.

5. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి
వాతావరణ మార్పుల వల్ల వచ్చే తీవ్ర వర్షాభావాలు, ఆకస్మిక వరదలను తట్టుకునే శక్తి సహజ ఆవరణాలు ఉన్న పొలాలకే ఉంటుంది. బహుళ పంటల సాగు, చెట్లతో కూడిన సాగు విధానాలు వాతావరణంలో ఉన్న కర్బనాన్ని నేలలో బంధించి భూతాపాన్ని తగ్గించటంలో సహాయపడతాయి.

వ్యవసాయాన్ని కేవలం ఉత్పత్తి సాధనంగా మాత్రమే కాకుండా, ప్రకృతితో మమేకమయ్యే పునరుత్పాదక వ్యవసాయంగా మార్చినప్పుడే భూతాపం తగ్గి, రైతుకు స్థిరమైన నికర ఆదాయం 
లభిస్తుంది.

ప్రజల భాగస్వామ్యం కీలకం
‘ఒక చేత్తో ప్రకృతిని ధ్వంసం చేస్తూ, మరో చేత్తో సరిదిద్దలేం. ప్రభుత్వాలు కేవలం విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ‘పునరుద్ధరణ ఆర్థిక వ్యవస్థ’ (రిస్టోరేషన్‌ ఎకానమీ)ని నిర్మించాలి.’

– ఆస్ట్రిడ్‌ షోమేకర్, ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ, ఐరాస జీవవైవిధ్య సదస్సు (సీబీడీ)

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)