Breaking News

గుండెదడ గండమేనా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Published on Tue, 09/29/2026 - 09:25

ప్రశాంతంగా కూర్చున్నప్పుడూ ఒక్కసారిగా గుండె దడ దడా కొట్టుకుంటుంది. మరికొందరికి గుండె ఒక బీట్‌ మానేసి, ఆ తర్వాత బలంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మొదట వచ్చే ఆలోచన ఒక్కటే. ఇది ‘‘గుండెకు ఏదైనా ప్రమాదమా?’’ అని. గుండెదడ అనుభవించినవారికి ఆ భయం సహజం. అయితే దడ వచ్చిన ప్రతిసారీ తీవ్రమైన గుంyð జబ్బు ఉన్నట్టు కాదు.

అదే సమయంలో, పదేపదే వచ్చే గుండెదడను ‘టెన్షన్‌ వల్లే’ అని మనకు మనమే నిర్ధారించుకోవడమూ సరికాదు. దడ ఎలా వస్తోందీ, దానితోపాటు మరేవైనా లక్షణాలున్నాయా, గుండె ఆరోగ్యం ఎలా ఉంది అన్నవి తెలుసుకుని అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. గుండె వేగం పెరిగినా, తగ్గినా, లయ తప్పినా తెలుసుకోవాల్సిన విషయాలను ఈరోజు సెప్టెంబరు 29న వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా తెలుసుకుందాం.

దడ అనేది గుండె తాలూకు ఒక లక్షణం. మన గుండె నిరంతరం కొట్టుకుంటున్నా సాధారణంగా ప్రతి స్పందననూ మనం గమనించం. అదే స్పందన వేగంగా, బలంగా, తడబడుతున్నట్టు లేదా మధ్యలో ఒక బీట్‌ తప్పినట్టు స్పష్టంగా అనిపించడాన్ని ‘పాల్పిటేషన్స్‌’ అంటారు. దీనినే మనం గుండె దడ అంటుంటాం.  కొందరికి ఛాతీలో, మరికొందరికి మెడ దగ్గదా లేదా గొంతులో ఈ అనుభూతి కలుగుతుంది. అది కొన్ని క్షణాలు ఉండవచ్చు. నిమిషాలపాటు లేదా అంతకంటే ఎక్కువసేపూ కొనసాగవచ్చు.

నిజానికి ఇదో జబ్బు కాదు గానీ... 
దడ అనేది ఒక జబ్బు పేరు కాదు. ఒక లక్షణం మాత్రమే. అలా గుండెదడ రావడానికి వెనక  కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతోనూ రావచ్చు. గుండె లయలో సమస్య వల్లనూ రావచ్చు. అందుకే ‘నాకు దడ వస్తోంది’ అనే ఒక్క విషయంతో కారణాన్ని నిర్ణయించలేం.

గుండె నిజంగానే ఒక బీట్‌ మానేస్తుందా?
ఈ అనుభూతికి ఒక సాధారణ కారణం ‘ఎక్టోపిక్‌ బీట్‌’. గుండెలో విద్యుత్‌ సంకేతాలు ఒక క్రమంలో ప్రయాణించి, గుండె కండరాన్ని సంకోచింపజేస్తాయి. కొన్ని సందర్భాల్లో రావాల్సిన సమయానికంటే ముందే ఒక స్పందన వస్తుంది. దాని తర్వాత చిన్న విరామం ఉండి, తదుపరి సాధారణ స్పందన మరింత బలంగా అనిపించవచ్చు. అప్పుడు ‘‘గుండె కాసేపు ఆగి మళ్లీ కొట్టుకుంది’’ అనిపిస్తుంది. ఆ అనుభూతి వచ్చినంత మాత్రాన గుండె ఆగిపోయిందని అర్థం కాదు.

ఇలాంటి ముందస్తు స్పందన గుండె పై గదుల నుంచి వస్తే దాన్ని ‘ప్రీమెచ్యూర్‌ ఏట్రియల్‌ కాంట్రాక్షన్‌’ లేదా ‘పీఏవీ’ అంటారు. కింది గదుల నుంచి వస్తే దాన్ని ‘ప్రీమెచ్యూర్‌ వెంట్రిక్యులర్‌ కాంట్రాక్షన్‌’ లేదా ‘పీవీసీ’ అంటారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ కనిపించవచ్చు. కొందరికి స్పష్టంగా తెలుస్తాయి. మరికొందరికి ఎలాంటి అనుభూతీ ఉండదు. అయితే ప్రతి గుండె దడా ఎక్టోపిక్‌ బీట్‌ వల్ల వచ్చేది కాదు.

కొన్ని మందుల వల్ల కూడా... 
మందుల విషయాన్నీ మర్చిపోకూడదు. కొన్ని జలుబు మందులు, కొన్ని ఆస్తమా మందులు, ఉత్తేజపరిచే పదార్థాలు ఉన్న ఉత్పత్తులతోనూ దడ రావచ్చు. వైద్యుడిని కలిసేటప్పుడు వాడుతున్న మందులు, సప్లిమెంట్ల వివరాలు చె΄్పాలి. అనుమానం వచ్చిందని అవసరమైన మందులను సొంతంగా ఆపేయకూడదు.
కాఫీ తాగిన ప్రతివారికీ దడ వస్తుందని చెప్పలేం. కానీ కాఫీ లేదా ఇతర కెఫీన్‌ పానీయాలు తీసుకున్న తర్వాత దడ పెరుగుతున్నట్టు గమనిస్తే వాటిని తగ్గించడం ఉపయోగపడవచ్చు. ఎనర్జీ డ్రింక్స్‌ కూడా దడను ప్రేరేపించవచ్చు. మనకు ఏ సందర్భంలో దడ వస్తోందో గమనించడం ముఖ్యం.

భయం వల్ల కూడా దడ రావచ్చు.... 
కానీ ప్రతిసారీ భయం వల్లనే కాకపోవచ్చు...
ఆందోళన గుండె దడను ప్రేరేపించగలదు. దడ అనిపించడం వల్ల భయమూ కలగవచ్చు. అయితే వ్యక్తి ఆందోళనగా కనిపిస్తున్నారనే కారణంతోనే సమస్యను కొట్టిపారేయకూడదు. లక్షణాల తీరును, వైద్య చరిత్రను పరిశీలించి అవసరమైన పరీక్షలు చేసిన తర్వాతే కారణంపై నిర్ణయానికి రావాలి.

వేగం పెరిగినా... తగ్గినా... లయ తప్పినా... 
గుండె విషయంలో ‘వేగం’, ‘లయ’ రెండూ ఒకటి కావు. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటోందన్నది వేగం. స్పందనలు ఏ క్రమంలో వస్తున్నాయన్నది లయ. పెద్దవారిలో (అడల్ట్స్‌లో) విశ్రాంతి సమయంలో గుండె సాధారణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ పరిధికి బయట ఉన్న ప్రతి సంఖ్యా జబ్బుకు సంకేతం కాదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వయసెంత, శారీరక దారుఢ్యం ఎలా ఉంది, మందులేమైనా వాడుతున్నామా అనే విషయాలూ చూడాలి.

ఇలా పొరబడటం సరికాదు... 
వ్యాయామం చేస్తున్నప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు, భయపడినప్పుడు గుండె వేగం పెరగవచ్చు. గుండెలోని సహజ పేస్‌మేకర్‌ నుంచే సంకేతాలు వేగంగా వస్తున్న ఈ ప్రతిస్పందనలను... అసాధారణ విద్యుత్‌ సంకేతాల వల్ల వచ్చే వేగమైన లయ సమస్యతో కలిపి చూసి పొరబడకూడదు. ముఖ్యంగా జ్వరం, రక్తహీనత వంటి కారణాలతో వేగం పెరిగితే అసలు కారణానికి చికిత్స చేయాలి. కేవలం గుండె వేగాన్ని తగ్గించే మందు వేసుకోవడం పరిష్కారం కాదు.

నెమ్మదిగా కొట్టుకుంటే పేస్‌మేకర్‌ అవసరమా?
నిమిషానికి 60 కంటే తక్కువ గా గుండె కొట్టుకోవడాన్ని సాధారణంగా ‘బ్రాడీకార్డియా’ అంటారు. కానీ నిద్రలో, మంచి శారీరక దారుఢ్యం ఉన్నవారిలో ఇది సహజంగానూ ఉండవచ్చు. గుండె వేగం 60 కంటే తక్కువగా ఉందనే ఒక్క కారణంతో పేస్‌మేకర్‌ అవసరం అనుకోకూడదు.

అయితే గుండె విద్యుత్‌ సంకేతాల సమస్య వల్ల వేగం తగ్గితే కొందరిలో అలసట, తలతిరుగుడు, ఆయాసం, స్పహ తప్పడం (సింకోప్‌) వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే మరికొందరిలో మాత్రం స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. మందులు లేదా సరిచేయగల ఇతర కారణాలున్నాయా, ఈసీజీలో ఎలాంటి సమస్య కనిపిస్తోంది అన్న అంశాలు పరిశీలించాలి. కొన్ని తీవ్రమైన గుండె విద్యుత్‌ సమస్యల్లో లక్షణాలు లేకున్నా పేస్‌మేకర్‌ అవసరమవుతుంది. అందుకే నిర్ణయం అన్నది ఒక సంఖ్య మీద కాకుండా, సమస్య స్వభావం మీద ఆధారపడ ఉంటుంది.

ఇదీ చదవండి: న్యూనత కాదు... న్యూ ట్రెండ్‌!

ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం వద్దు... 
దడతోపాటు ఛాతీలో నొప్పి లేదా మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలతిరుగుడు, స్పహ తప్పడం లేదా తప్పుతున్నట్టు అనిపించడం ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. స్వయంగా వాహనం నడుపుకుంటూ వెళ్లకూడదు. ఈ లక్షణాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోయినప్పటికీ అత్యవసరంగా వైద్య సలహా తీసుకోవాలి.

దడ పదేపదే వస్తున్నా, మునుపటికంటే ఎక్కువవుతున్నా, ఎక్కువసేపు కొనసాగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు మరింత శ్రద్ధ చూపాలి. వ్యాయామ సమయంలో అసాధారణంగా దడ రావడం, కుటుంబంలో చిన్న వయసులో కారణం తెలియకుండా ఆకస్మిక మరణాలు సంభవించడం వంటి వివరాలను కూడా వైద్యుడికి తప్పనిసరిగా చె΄్పాలి.

ఇలా దడ రావడానికి గుండె అంశాలు మాత్రమే కారణం కాదు...
నిద్ర సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, మద్యం, పొగాకు, కెఫీన్‌ వంటి పలు అంశాలు కొందరిలో దడను ప్రేరేపించవచ్చు. జ్వరం ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేస్తున్నప్పుడు కూడా దడ రావచ్చు. మహిళల్లో గర్భధారణ, మెనోపాజ్‌ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులూ ఒక కారణం కావచ్చు.

క్రమం తప్పితే ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ కూడా కావచ్చు...
‘ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌’ (ఏఎఫ్‌)లో గుండె పై గదుల స్పందనలు అస్తవ్యస్తమవుతాయి. నాడి క్రమం తప్పి కొట్టుకుంటుంది; వేగంగానూ ఉండవచ్చు. కొందరికి దడ, అలసట, ఆయాసం ఉంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.

దీనిని గుర్తించడం ఎందుకంత అవసరమో తెలుసుకునేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ‘ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌’ (ఏఎఫ్‌) వల్ల కొందరిలో గుండెలో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డ మెదడుకు చేరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చికిత్స దడను తగ్గించడానికే పరిమితం కాదు. ఆ వ్యక్తిలో పక్షవాతం వచ్చే ముప్పును కూడా అంచనా వేసి, అవసరమైనవారికి డాక్టర్లు  రక్తం గడ్డకట్టకుండా చేసే ‘యాంటీకోయాగ్యులెంట్‌’ మందులు సూచిస్తారు. ప్రతి ఎక్టోపిక్‌ బీట్‌నూ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ (ఏఎఫ్‌)గా భావించకూడదు. అలాగే ఏఎఫ్‌ నిర్ధారణ అయినవారు దడ తగ్గిందికదా అని ఈ మందులను సొంతంగా ఆపకూడదు.

దడ వచ్చినప్పుడు ఏం చేయాలి?
చేస్తున్న పనిని ఆపి విశ్రాంతిగా, సురక్షితంగా కూర్చోవాలి. దడ మొదలైన సమయం, ఎంతసేపు కొనసాగిందో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారిగా మొదలైందా, క్రమంగా పెరిగిందా, ఏవైనా మందు(లు) లేదా పానీయం తీసుకున్న తర్వాత వచ్చిందా వంటి వివరాలను నమోదు చేసుకుని చెబితే అవి డాక్టర్లకు ఉపయోగపడతాయి. అయితే ఛాతీనొప్పి, శ్వాస ఇబ్బంది, çస్పృహ తప్పుతున్న భావన వంటి హెచ్చరికలు ఉంటే వివరాలు రాసుకోవడంలోనో, వాచ్‌లో రికార్డు చేయడంలోనో సమయం గడపకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇంటి చిట్కాలతో తగ్గుతుందేమోనని వేచి ఉండకూడదు.

సుప్రావెంట్రిక్యులర్‌ టాకీకార్డియా (ఎస్‌వీటీ) అంటే...
కొందరికి తాము ప్రశాంతంగా ఉన్నప్పుడే గుండె ఒక్కసారిగా చాలా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కొంతసేపటికి అంతే హఠాత్తుగా తగ్గిపోవచ్చు. ఇలాంటి అనుభూతికి ‘సుప్రావెంట్రిక్యులర్‌ టాకీకార్డియా’ లేదా ‘ఎస్‌వీటీ’ అనే అంశం ఒక కారణం కావచ్చు. గుండెలో విద్యుత్‌ సంకేతాలు ప్రయాణించే విధానంలో సమస్య దీనికి కారణమవుతుంది. దడ వస్తున్న సమయంలో తీసిన ఈసీజీ... దీని నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే లక్షణాలను బట్టి మాత్రమే ‘సుప్రావెంట్రిక్యులర్‌ టాకీకార్డియా’ లేదా ‘ఎస్‌వీటీ’ అని నిర్ణయించలేం.

స్మార్ట్‌వాచ్‌ హెచ్చరికను ఎలా చూడాలి?
కొందరు తమ గుండె లయను స్మార్ట్‌వాచ్‌లో చూసుకుంటూ ఉంటారు. ఇలా స్మార్ట్‌వాచ్‌లో ‘ఇర్రెగ్యులర్‌ రిథమ్‌’ అని కనిపించగానే తీవ్రమైన జబ్బు ఉందని నిర్ణయించుకోవద్దు. అదే సమయంలో ఆ సమాచారాన్ని పూర్తిగా పక్కన పెట్టకూడదు. కొన్ని పరికరాలు ఉపయోగకరమైన ఈసీజీ రికార్డింగులను అందించగలవు. కానీ ఆ పరికరం ఇచ్చే ఆటోమేటిక్‌ హెచ్చరిక ఒక్కటే  పూర్తి వైద్య నిర్ధారణ కానేరదు. ఆ రికార్డింగ్‌ను భద్రపరచి వైద్యుడికి చూపాలి.

వాచ్‌ సాధారణంగా చూపిస్తోందని కదా అని... ఛాతీనొప్పి, ఆయాసం, స్పృహ తప్పడం వంటి లక్షణాలుంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే పదేపదే అంకెలను చూసుకుంటూ ఆందోళన పెంచుకోవడమూ మంచిది కాదు. పరికరం ఇచ్చే సమాచారం వైద్య అంచనాకు తోడ్పడాలి.

గుండె దడ వచ్చినప్పుడు చేయాల్సింది దాని కారణాన్ని తెలుసుకోవడం. అవసరమైన పరీక్షలతో ముప్పును అంచనా వేసి, చికిత్స అవసరమైతే తీసుకోవాలి. ప్రమాదకరమైన సమస్య లేదని నిర్ధారణ అయితే ఆ భరోసాతో హాయిగా రోజువారీ జీవితాన్ని కొనసాగించాలి. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే: గుండె ఇచ్చే హెచ్చరికలను గుర్తించాలి. అంతేతప్ప... సాధారణ స్పందనల గురించి అనవసరమైన భయాలతో జీవించకూడదు.

ఒకసారి ఈసీజీ బాగుంటే సరిపోతుందా?
గుండె దడను పరిశీలించడంలో ఈసీజీ ముఖ్యమైన పరీక్ష. అయితే అది తీసిన సమయంలోని గుండె వివరాలను మాత్రమే నమోదు చేస్తుంది. మధ్యమధ్యలో వచ్చే లయ సమస్యా, పరీక్ష చేస్తున్నప్పుడు లేకపోతే ఆ ఈసీజీలో అవి  కనిపించకపోవచ్చు. అందుకే ఒకసారి ఈసీజీ నార్మల్‌గా వచ్చిందని, మళ్లీ మళ్లీ వస్తున్న లక్షణాలను పట్టించుకోకుండా ఉండకూడదు.

హోల్టర్‌ మానిటర్‌ ఎందుకంటే...?
అవసరాన్ని బట్టి డాక్టర్లు హోల్టర్‌ మానిటర్‌ అనే పరీక్షను సూచించవచ్చు. ఇది సాధారణ రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా గుండె లయను ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువసేపు నమోదు చేస్తుంది. దడ అరుదుగా వస్తుంటే మరింత ఎక్కువకాలం నమోదు చేసే పరికరం అవసరమవచ్చు. లక్షణాలు ఎంత తరచుగా వస్తున్నాయన్న అంశాన్ని బట్టి పరీక్ష కోసం ఏ పరికరాన్ని వాడాలననది డాక్టర్లు నిర్ణయిస్తారు.

గుండె నిర్మాణం, కవాటాలు, పంపింగ్‌ పనితీరు తెలుసుకోవడానికి ఎకో పరీక్ష ఉపయోగపడుతుంది. పరిస్థితిని బట్టి థైరాయిడ్, పొటాషియం వంటి అంశాలను తెలుసుకోడానికి కొన్ని రక్తపరీక్షలు చేయాల్సి రావచ్చు. అందరికీ అన్ని పరీక్షలూ అవసరం ఉండవు. దడ వచ్చిన సమయం, అది ఎంతసేపు కొనసాగింది, అప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా అనే వివరాలు... ఏయే పరీక్షలను ఎంచుకోవాలనే విషయంలో డాక్టర్లకు ఉపయోగపడే అంశాలవుతాయి.

బలంగా అనిపిస్తే ఎక్కువ ప్రమాదమా?
ఎక్టోపిక్‌ బీట్స్‌ విషయంలో చాలామందికి తెలియని విషయం ఇది. దడ ఎంత బలంగా అనిపిస్తోందన్నది ఒక్కటే ప్రమాదానికి కొలమానం కాదు. అప్పుడప్పుడు వచ్చే కొన్ని ‘ప్రీమెచ్యూర్‌ వెంట్రిక్యులర్‌ కాంట్రాక్షన్‌’ (పీవీసీ)లు కొందరికి చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. మరొకరికి ఎక్కువ సంఖ్యలో ఉన్నా పెద్దగా తెలియకపోవచ్చు.

వైద్యులు వాటి సంఖ్యను మాత్రమే కాకుండా, అవి వచ్చే తీరును, గుండె నిర్మాణాన్ని, పంపింగ్‌ పనితీరును, ఇతర లక్షణాలను కలిపి పరిశీలిస్తారు. గుండె ఆరోగ్యంగా ఉండి, అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఎక్టోపిక్‌ బీట్స్‌ ఉన్న చాలామందికి ప్రత్యేక చికిత్స అవసరం ఉండదు. అయితే తరచుగా, ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘ప్రీమెచ్యూర్‌ వెంట్రిక్యులర్‌ కాంట్రాక్షన్‌’ (పీఏసీ)లు  కొందరిలో గుండె కండరాన్ని బలహీనపరచవచ్చు. అందువల్ల ‘ఎక్టోపిక్‌ బీట్స్‌ అన్నీ ప్రమాదమే’ అనడమూ సరికాదు; ‘‘వాటిని ఎప్పుడూ పట్టించుకోనక్కర్లేదు’’ అనడమూ సరికాదు.

ప్రతి దడకూ మందులు అవసరమా?
కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. దడకు థైరాయిడ్‌ సమస్య లేదా రక్తహీనత వంటి కారణం ఉంటే దానికి తగిన చికిత్స అందించడం అవసరం. గుండెలో ప్రమాదకరమైన సమస్య లేదని నిర్ధారణ అయిన తర్వాత, కొందరికి కారణాన్ని వివరించడం, నిద్రను మెరుగుపరచడం, దడను ప్రేరేపించే అలవాట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలు / సూచనలు సరిపోవచ్చు.

లక్షణాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా లయ సమస్య స్వభావాన్ని బట్టి వైద్యులు మందులు సూచిస్తారు. ఎంపిక చేసిన రోగుల్లో ‘క్యాథెటర్‌ అబ్లేషన్‌’ అనే చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో సన్నని క్యాథెటర్‌ ద్వారా గుండెలో సమస్యకు కారణమవుతున్న విద్యుత్‌ సంకేతాల ్రపాంతాన్ని గుర్తించి చికిత్స చేస్తారు. ఎవరికి మందులు, ఎవరికి అబ్లేషన్, ఎవరికి పర్యవేక్షణ చాలు అన్న అంశాలు వాళ్ల వాళ్ల వ్యక్తిగత పరిస్థితిని బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. దడ వచ్చిందని ఇతరులు వాడే గుండె మందులను సొంతంగా తీసుకోవడం ఎంతమాత్రమూ సరికాదు.

డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

- నిర్వహణ : యాసీన్‌

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు