2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
రూ.711 కోట్ల ఇల్లు కొంటున్న ‘ఇంటర్’ బిజినెస్‌మ్యాన్!
Published on Wed, 09/23/2026 - 16:38
స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ ఠక్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జుహూలో ఏకంగా ఓ పూర్తి రెసిడెన్షియల్ టవర్‌ను ఆయన కొంటున్నారు. ఎంబసీ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్‌కు చెందిన ‘ఎంబసీ టెరాజ్జా’ ప్రాజెక్టులోని ఈ టవర్ విలువ సుమారు రూ.711 కోట్లు. ఈ డీల్‌ను దేశంలోనే అతిపెద్ద సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ లావాదేవీగా ఎంబసీ డెవలప్‌మెంట్స్ పేర్కొంది.
భారీ విస్తీర్ణం
జుహూ తారా రోడ్డులో ఉన్న ఎంబసీ టెరాజ్జా అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులో భాగమైన ఈ నివాస టవర్ ఎనిమిది అంతస్తులు (G+7) కలిగి ఉంది. దీని కార్పెట్ ఏరియా సుమారు 63,000 చదరపు అడుగులు. ఒక్కో అంతస్తులో ఒకే నివాస యూనిట్ ఉండేలా ప్రాజెక్టును రూపొందించారు. సముద్రం, సుందర నగరం వీక్షించే సౌకర్యరాతోపాటు ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ సదుపాయాలు ఇందులో ఉంటాయి.
రెండు ఎకరాలకు పైగా విస్తరించిన ఎంబసీ టెరాజ్జాలో సుమారు 50 నివాసాలు, ఐదు టవర్లు ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం గ్రాస్ డెవలప్‌మెంట్ వ్యాల్యూ (GDV) రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని ఎంబసీ డెవలప్‌మెంట్స్ తెలిపింది.
ఇంటి పేరు ఇదే..
దినేశ్ ఠక్కర్ ఈ టవర్‌ను తన కుటుంబ నివాసంగా ఉపయోగించుకోనున్నారు. దీనికి ‘ఏంజిలస్’ (Angelus) అని పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు ప్రైవసీ, విశాలమైన స్థలం, సముద్ర వీక్షణం వంటి సౌకర్యాలతో కుటుంబంతో నివసించేందుకు విలాసవంతమైన ఇల్లు తన ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయని ఠక్కర్ వెల్లడించారు.
12వ తరగతితోనే చదువు ఆపేసి..
దినేశ్ ఠక్కర్ వ్యాపార ప్రయాణం కూడా ఆసక్తికరమే. ముంబైలోని ములుంద్‌లో వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆయన కుటుంబం వస్త్ర వ్యాపారంలో ఉండేది. థానేలోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ హైస్కూల్‌లో చదివిన ఆయన, అనంతరం ముంబైలోని కిషిన్‌చంద్ చెల్లారం కాలేజీలో సైన్స్ చదివారు. అయితే 12వ తరగతి తర్వాత ఉన్నత విద్యను కొనసాగించలేదు.
కుటుంబ వ్యాపారంలో చేరినప్పటికీ, అక్కడి పరిమితులు తనకు నచ్చక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబం నుంచి మూలధనం తీసుకుంటే దానితో పాటు కొన్ని పరిమితులు వస్తాయని, అందుకే స్వతంత్రంగా ఉండాలని భావించినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సుమారు రూ.2.5 లక్షల చిన్న మూలధనంతో తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
1988లో స్టాక్ మార్కెట్‌లోకి..
ఠక్కర్ 1988లో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు ఆయనకు బ్రోకింగ్ రంగంపై పెద్దగా అవగాహన లేదు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, మార్కెట్ పతనంతో పెట్టుబడిలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోయారు. అయినప్పటికీ మార్కెట్‌ను విడిచిపెట్టకుండా బ్రోకింగ్ వ్యాపారంలోని అవకాశాలను అధ్యయనం చేశారు.
1992 హర్షద్ మెహతా సెక్యూరిటీస్ స్కామ్ ఆయన వ్యాపార ప్రయాణంలో మరో భారీ ఎదురుదెబ్బగా మారింది. ఖాతాదారులు చెల్లింపుల్లో విఫలమవడంతో ఆయనపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా వ్యాపారాన్ని పునర్నిర్మించుకున్నారు.
1996లో ఏంజెల్ బ్రోకింగ్..
ఈ అనుభవాల తర్వాత 1996లో ఏంజెల్ బ్రోకింగ్‌ను సంప్రదాయ స్టాక్ బ్రోకింగ్ సంస్థగా ప్రారంభించారు. కంపెనీ అధికారిక సమాచారం ప్రకారం, ఏంజెల్ వన్ 1996 ఆగస్టు 8న స్థాపించబడింది. తర్వాత సంప్రదాయ బ్రోకింగ్ సంస్థ నుంచి డిజిటల్-ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా రూపాంతరం చెందింది. 2019లో కంపెనీ డిజిటల్ జర్నీని ప్రారంభించింది.
2020 అక్టోబర్ 5న ఏంజెల్ బ్రోకింగ్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ రికార్డుల ప్రకారం, కంపెనీ 1996లోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దినేశ్ ఠక్కర్ ఏంజెల్ వన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: కాబోయే రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు!
Tags : 1