మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
Published on Fri, 09/04/2026 - 11:25
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.
ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్‌ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.
అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి!
Tags : 1