Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు
Breaking News
కండరాలు, గుండె పనితీరుకు ఆ విటమిన్ అత్యంత కీలకం..!
Published on Wed, 09/02/2026 - 10:43
ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో విటమిన్–డీ2 కంటే విటమిన్–డీ3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్లోని ఐసీఎమ్ఆర్– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపం ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే ప్రక్రియలో విటమిన్–డీ3 కీలక పాత్ర పోషిస్తుందని మగ ఎలుకలపై జరిపిన ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక ‘మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.
పరిశోధనలో ఏం తేలిందంటే..
కండరాల పుష్టి: విటమిన్–డీ2తో పోలిస్తే విటమిన్–డీ3 తీసుకున్న ఎలుకలలో కండరాల పరిమాణం, కండరాల పీచు పరిమాణం, పట్టుకునే బలం గణనీయంగా పెరిగాయి.
గుండె ఆరోగ్యం: గుండె కండరాల సంకోచవ్యాకోచాలు, గుండెకు సంబంధించిన జీవక్రియలలో విటమిన్–డీ3 అద్భుతమైన ఫలితాలను చూపించింది.
శక్తి జీవక్రియలు: కండరాలవృద్ధికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి సంబంధించిన రసాయన ప్రక్రియలను విటమిన్–డీ3 వేగవంతం చేసింది.
పరిశోధన ఇలాగ
విటమిన్–డీ సాధారణంగా డీ–2, డీ–3 గా రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల కోసం ప్రయోగశాలలో పెరుగుతున్న మగ ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఒక సమూహానికి విటమిన్–డీ2, మరొక సమూహానికి విటమిన్–డీ3, ఇంకొక సమూహానికి రెండింటి మిశ్రమాన్ని, చివరి సమూహానికి విటమిన్–డీ లేని ఆహారాన్ని ఇచ్చారు.
గుండె నిర్మాణాన్ని రక్షించడంలో..
శరీరంలో కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ రెండు విటమిన్లు సమానంగా పనిచేసినప్పటికీ, కండరాలు, గుండె నిర్మాణాన్ని రక్షించడంలో విటమిన్–డీ3 ఎంతో శక్తివంతమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషాఇస్మాయిల్ వివరించారు.
భవిష్యత్తులో ప్రజలకు అందించే విటమిన్ అనుబంధ ఆహారాలు (సప్లిమెంట్లు), పౌష్టికాహార పెంపుదల (ఫోర్టిఫికేషన్) కార్యక్రమాలలో కీలక మార్పులకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు. మానవులపై దీని ప్రభావాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని తెలిపారు.
(చదవండి: ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!)
Tags : 1