సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Breaking News
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
Published on Wed, 04/15/2026 - 00:31
‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.
సల్మాన్ భాయ్ వచ్చాడు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.
ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్‌రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
హిట్ 4
అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్‌గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.
‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
డబుల్ ధమాకా!
‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.
మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.
నిశ్శబ్దం పెరిగేకొద్దీ...
‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్‌చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్‌గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.
హీరోగా హాస్యనటుడు
చాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.
తెలుగులో బిజీ బిజీ
‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్‌లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది.
షూటర్ విశ్వనాథ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్‌గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్‌గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్‌తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్‌గా మమితా బైజు కనిపిస్తారు.
రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.
ఒకేసారి రెండు సినిమాలు
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్‌గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.
ఈసారి హీరోగా..!
తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.
యాక్షన్ థ్రిల్లర్
తమిళంలో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్‌లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్‌లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.
– ముసిమి శివాంజనేయులు
Tags : 1