₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
బైక్ డ్రైవర్ ఖాతాలో రూ.550 కోట్లు..
Published on Thu, 03/05/2026 - 14:38
నెలకు పట్టుమని రూ.పది వేలు సంపాదించలేని ఒక సాధారణ డ్రైవర్.. వందల కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమయ్యాడు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా రూ.550 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా మార్గాల ద్వారా ఈ భారీ నెట్‌వర్క్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.
రూ.25 వేల ఆశ జూపి..
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్ ఓడే, కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను రూ.25,000కు అద్దెకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను సంతకం చేసిన ప్రతి చెక్కుకు అదనంగా రూ.400 కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రదీప్ పత్రాలను ఉపయోగించి నిందితులు ‘ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో ఒక డమ్మీ సంస్థను స్థాపించారు.
ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో రెండు షెల్ కంపెనీలను 2024లో నమోదు చేశారు. ఈ సంస్థలకు వాస్తవంగా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. కానీ, వీటి బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూ.550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. మూడు వేర్వేరు కంపెనీలకు వరుసగా రూ.80.50 కోట్లు, రూ. 52.11 కోట్లు, రూ.22.86 కోట్ల చొప్పున డబ్బు బదిలీ అయినట్లు ఈడీ తేల్చింది.
క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్
ఈ భారీ మొత్తమంతా అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం బెట్టింగ్ మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్‌లో ‘సర్క్యులర్ ట్రేడింగ్’(కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచడం) ద్వారా షేర్ల ధరలను తారుమారు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. ‘సాధారణ పొదుపు ఖాతాగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు సంబంధించిన హవాలా ఛానెల్‌గా పనిచేస్తోంది’ అని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఇంపాక్ట్ గురు’ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించి వాటిని మనీ లాండరింగ్‌కు వినియోగించినట్లు తెలుస్తుంది.
ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరికి చేరుతోంది? అనే అంశంపై ఈడీ ప్రస్తుతం మనీ ట్రయిల్(డబ్బు వెళ్లిన క్రమం)ను ట్రాక్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఆస్తుల అటాచ్‌మెంట్, కీలక వ్యక్తుల అరెస్టులు ఉండొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
Tags : 1