విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
Published on Wed, 03/04/2026 - 16:54
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...
ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.
టీనేజ్ దశలో...
యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా వేయించాలి.
సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు.
వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.
పునరుత్పాదక వయస్సులో...
20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్‌ఫాక్స్, హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి.
గర్భధారణ ప్లానింగ్‌కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.
40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.
మెనోపాజ్ దశలో...
నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.
ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.
మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
Tags : 1