మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
ఏఐ భయాలు నిజమే.. కానీ..
Published on Mon, 02/16/2026 - 14:24
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్‌వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయం
గత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్‌వేర్ బడ్జెట్‌ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వేగమే అసలు సవాలు
ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.
అపరిమిత అవకాశాలు
భారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్‌కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
Tags : 1