Breaking News

తెలుగు తెరపై కొత్తందం

Published on Sun, 02/08/2026 - 04:00

ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్‌ వేద్దాం.

లక్కీ చాన్స్‌ 
ప్రభాస్‌ వంటి పాన్‌ ఇండియా స్టార్‌తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్‌కు అయినా లక్కీ చాన్స్‌ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్‌ ఇమాన్వీ ఇస్మాయిల్‌కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్‌గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భానుచందర్‌ ప్రధాన పాత్రల్లో  నటిస్తున్నారు.

తొలి సినిమాయే ప్రభాస్‌ వంటి టాప్‌ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ వంటి సీనియర్‌ నటీనటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్‌ పరంగా ఇది బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పుకోవచ్చు.  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

వెల్‌కమ్‌ జోయా 
రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్‌’ చిత్రం 2023లో విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్‌’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.

కానీ ఫైనల్‌గా ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్‌కు వస్తున్నారు. ఈ యంగ్‌ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌ ‘స్పిరిట్‌’  కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్‌’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్‌ రెడ్డివంగాయే ‘స్పిరిట్‌’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్‌ కానుంది.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్‌ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్‌’ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో  ప్రభాస్‌ తొలిసారిపోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్‌ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్‌రాజ్, కాంచన, వివేక్‌ ఓబెరాయ్‌ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సీతా పయనం 
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్‌ హీరోయిన్‌గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్‌ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్‌ రోల్‌ చేశారు.

ఆకాశంలో ఒక తార 
‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్‌ రోల్‌ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా చేస్తున్నారు. మరో హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్‌ సమర్పణలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్‌ ఎమోషనల్‌ అండ్‌ ఫీల్‌ గుడ్‌ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

శ్రీను–మంగల లవ్‌స్టోరీ 
బాలీవుడ్‌లో వన్నాఫ్‌ ది టాప్‌ హీరోయిన్స్‌ అయిన రవీనా టాండన్‌ కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది.   ‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో రానున్న ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రంలో  శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. సి. అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరకర్త.

లెగసీ 
‘లెగసీ’ అనే ΄పొలిటికల్‌ మూవీతో టాలీవుడ్‌కి వస్తున్నారు కన్నడ హీరోయిన్‌ ఏక్తా రాథోడ్‌. విశ్వక్‌ సేన్‌ హీరోగా సాయికిరణ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్‌ ఈజ్‌ పర్సనల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్‌ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్‌ సిటీ, మాస్టర్‌ పీస్‌’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్‌. విశ్వక్‌ సేన్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్‌ దగ్గుమాటి, సాయికిరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు అమ్మాయి 
హరికృష్ణ మనవడు, జానకి రామ్‌ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్‌ చౌదరి కొంత గ్యాప్‌ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్‌ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్‌గా ఈ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్‌ వంటి అంశాలపై అప్‌డేట్‌ రావాల్సి ఉంది.  

పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్‌’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్‌. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలో నందిని  (నందిని రోల్‌ను ఐశ్వర్యా రాయ్‌ చేయగా, ఈ రోల్‌ యంగ్‌గా ఉన్నప్పటి సీన్స్‌లో సారా అర్జున్‌ నటించారు) పాత్రలో నటించి, యంగ్‌ యాక్టర్‌గా పాపులర్‌ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్‌లో విడుదలైన   ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్‌ యాక్టర్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్‌ పరిచయం అయ్యారు.

గుణశేఖర్‌ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ద్విభాషా  (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్‌’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ‘ధురంధర్‌’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్‌గా హిందీలో సారా అర్జున్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.

‘ది రాజాసాబ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు హీరోయిన్‌ మాళవికా మోహనన్‌. ప్రభాస్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్‌’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్‌ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్‌ దేవరకొండ, మాళవికా మోహనన్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమాలోని హీరోయిన్‌ పాత్ర కోసం మాళవికా మోహనన్‌ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్‌లో మాళవిక పేరు ఫైనలైజ్‌ కాలేదు. ఈ చాన్స్‌ శ్రుతీహాసన్‌కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్‌ రాక కాస్త ఆలస్యమైంది.  

ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Videos

మంత్రి మీటింగ్ కోసం అంతిమయాత్రను అడ్డుకున్న పోలీసులు

అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, పూజిత

చరణ్, తారక్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. RRR సీక్వెల్ కన్ఫర్మ్.. త్వరలోనే..!

కాలువలో పడ్డ కారు వెలికితీత

కన్న బిడ్డలను చంపుకున్న ఇద్దరమ్మల కన్నీటి కథ..

ప్రమాదం ప్రభుత్వమే చేసిందా? కాలిబూడిదైన కీలక ఆధారాలు

పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ రేట్

అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్

కాశ్మీర్ విషయంలో పాక్ కు షాక్ ఇచ్చిన అమెరికా

Photos

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

'అమ‌రావ‌తికి ఆహ్వానం' హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)