Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత
Breaking News
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
Published on Mon, 02/02/2026 - 13:52
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నిధుల కొరత
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తొలగింపుల ద్వారా ఎంతంటే..
ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.
వ్యూహాత్మక మార్పులు
నిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్‌వేర్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్‌పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.
భారీ లక్ష్యాలు
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
Tags : 1