TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
Breaking News
విడాకులంటే మాటలు కాదు డబ్బులు!
Published on Tue, 01/20/2026 - 17:57
విడాకుల కల్చర్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సామాన్యులు, సంపన్నులు అనే బేధం లేకుండా విడిపోతున్న జంటలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఆలుమగల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడినప్పుడు విడాకులు అనివార్యమవుతున్నాయి. సామాజిక కట్టుబాట్లకు భయపడి మిడిల్‌క్లాస్ జంటలు ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేందుకు జంకుతున్నాయి. కానీ ఎగువ మధ్య తరగతి, సంపన్నులు మాత్రం 'డోంట్ కేర్' అంటున్నారు. కలిసి కలహించుకునే కంటే.. విడిపోయి ఎవరిదారి వారు చూసుకుని హాయిగా ఉండాలన్న ఉద్దేశంతో విడాకులకు మొగ్గు చూపిస్తున్నారు. డివోర్స్‌కు దారి తీస్తున్న కారణాలు చాలానే ఉన్నాయి. సరే వాటి గురించి పక్కన పెడదాం.
ఇప్పుడీ విడాకుల గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం జోహూ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టుకెక్కారు. భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకెళ్లడం పెద్ద విషయం కాదు గానీ.. న్యాయస్థానం వేసిన ఆర్డరే ఆసక్తికర అంశంగా మారి పతాక శీర్షికలకు ఎక్కింది. విడాకుల విషయం తేలేంతవరకు 1.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 15 వేల కోట్ల రూపాయలు తమ వద్ద డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ఇది విన్నవారంతా.. 'ఆ' అంటూ నోరెళ్ల బెడుతున్నారు. బిలియనీర్ల విడాకులు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కొంతమంది సమాధానపడుతున్నారు. బిల్ గేట్, జెఫ్ బెజోస్ డివోర్స్ ఉదంతాలను ఉదాహరణగా చూపుతున్నారు.
బెజోస్, స్కాట్ డివోర్స్
జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ దంపతుల విడాకుల వ్యవహారం చరిత్రలోనే అత్యంత ఖరీదైన డివోర్స్‌గా ప్రాచుర్యం పొందింది. తమ పాతికేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు 2019, జనవరిలో వీరు ప్రకటించారు. బెజోస్ నుంచి విడిపోయినందుకు మెకెంజీ స్కాట్.. అమెజాన్ స్టాక్‌లో దాదాపు 4 శాతం వాటాను దక్కించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అప్పటి లెక్కల ప్రకారం ఈ వాటా విలువ 38 బిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3 లక్షల 20 వేల కోట్ల రూపాయలు. కాగా, మెకెంజీ స్కాట్.. గతేడాది చివరిలో 19 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు విరాళం ఇచ్చారని ఫోర్బ్స్ తెలిపింది.
బిల్‌గేట్స్, మిలిందా విడాకులు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి 2021, ఆగస్టు నెలలో ముగింపు పలికారు. మనోవర్తి కింద మిలిందాకు బిల్‌గేట్స్ 7.9 బిలియన్ డాలర్లు (దాదాపు 65 వేల కోట్ల రూపాయలు) చెల్లించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. జెఫ్రీ ఎప్స్టీన్ తో బిల్‌గేట్స్ (Bill Gates) ఉన్న 'పాత పరిచయమే' తమ విడాకులకు ప్రధాన కారణమని మిలిందా 'సీబీఎస్ మార్నింగ్'తో చెప్పారు.
ఆ డబ్బును ప్లాస్టిక్ సర్జరీలకు వాడొద్దు
ఫ్రెంచ్-అమెరికన్ ఆర్ట్ డీలర్ అలెక్ వైల్డెన్‌స్టెయిన్ కూడా విడాకుల కోసం భారీ మొత్తాన్నే వెచ్చించారు. తన భార్య జోసెలిన్ నుంచి 1999లో విడాకులు తీసుకున్నారు. జోసెలిన్‌ను 2.5 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాలని అలెక్‌ను అప్పట్లో కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఏడాదికి 13 మిలియన్ డాలర్ల చొప్పున 13 ఏళ్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. భరణంగా వచ్చిన డబ్బును ప్లాస్టిక్ సర్జరీ కోసం వినియోగించరాదని జోసెలిన్‌కు కోర్టు షరతు విధించింది. కాగా, ఆమె విలాసవంతమైన జీవితమే విడాకులకు కారణమన్న వాదనలు ఉన్నాయి.
మీడియా మొఘల్ కాస్ట్లీ డివోర్స్
మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ (Rupert Murdoch) నాలుగుసార్లు విడాకులు తీసుకున్నారు. 1999లో తన రెండో భార్య అన్నా డిపెస్టర్ నుంచి ఆయన విడిపోయి 32 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. దీని కోసం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 14 వేల కోట్ల రూపాయలు) చెల్లించారు. అంతేకాదు అన్నా డిపెస్టర్ నలుగురు పిల్లలకు తన మీడియా సామ్రాజ్యంలో వాటా ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. అన్నా డిపెస్టర్ నుంచి విడిపోయిన 17 రోజులకే వెండి డెంగ్‌ను రూపర్ట్ ముర్డోక్ మూడో పెళ్లి చేసుకోవడం గమనార్హం.
చదవండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు!
పైన చెప్పుకున్న వారే కాదు ఎలాన్ మస్క్-జస్టిన్, దిమిత్రి రైబోలోలెవ్-ఎలీనా, కాన్యే వెస్ట్- కిమ్ కర్దాషియాన్, బెర్నీ ఎలెన్‌స్టోన్-స్లావికా, స్లీవ్ వీన్-ఎలైన్ తదితర జంటల విడాకులు కూడా అత్యంత ఖరీదైన వాటిలో ఉన్నాయి.
Tags : 1