బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
Published on Sat, 08/02/2025 - 14:27
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.
నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్‌కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.
నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట.
అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్‌లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్‌లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.
చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్‌కి షాకవ్వాల్సిందే!
Tags : 1