‘కర్ణాటక’ కుట్రపై  అధికారుల అలర్ట్‌!

Karnataka government is conspiring to move companies in Telangana to Bengaluru - Sakshi

తెలంగాణ నుంచి పరిశ్రమలు, సంస్థలను తరలించుకుంటున్నారనే ఆరోపణలపై నజర్‌ 

బెంగళూరుకు వస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆ రాష్ట్రం నుంచి కంపెనీలకు లేఖలు వెళ్తున్నాయనే ప్రచారం 

తెరవెనుక అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి పాటిల్‌ !

ఆంగ్ల, కన్నడ పత్రికల్లో కథనాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్‌ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్‌ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ ఇటీవల ఫాక్స్‌కాన్‌ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 

ఎన్నికల సమయమే అదనుగా.. 
బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌షా, ఖాతాబుక్‌ స్టార్టప్‌ సీఈవో రవీశ్‌ నరేశ్, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్‌ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి.

ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్‌ కంపెనీ సీఈవో రాజేశ్‌ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్‌–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. 

గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. 
గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్‌ సీఈవో యంగ్‌లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.

ఆ మరునాడే ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్‌ మీడియాలో వైరల్‌ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్‌ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. 

కోడై కూస్తున్న కన్నడ పత్రికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు.

బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,  మంత్రి ఎంబీ పాటిల్‌ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్‌ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. 

ఊహకందని రీతిలో పురోగతితో.. 
హైదరాబాద్‌ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్‌తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు.

అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్‌ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top