కాళేశ్వరంపై న్యాయ విచారణ జరపాలి | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై న్యాయ విచారణ జరపాలి

Published Sat, Nov 4 2023 2:53 AM

A judicial inquiry should be conducted against Kaleswaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్‌లోపాలు, అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని పలువురు మేధావులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు డిమాండ్‌ చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేసి, అందులో లేవనెత్తిన లోపాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రిటైర్డ్‌ ఇంజనీర్లు, మేధావులు పాల్గొని మాట్లాడారు.

క్షేత్ర స్థాయిలో సర్వేలు లేకుండా గిన్నిస్‌ రికార్డుల కోసమే కాళేశ్వరం నిర్మించారని టీజేఎస్‌ అధినేత కోదండరాం ఆరోపించారు. ఇంజనీర్లు, వైస్‌ చాన్స్‌లర్లు, ఇతర నిపుణుల పనులు సైతం తానే చేయాలని సీఎం కేసీఆర్‌ కోరుకోవడంతో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకుండా పోయిందన్నారు. ఇంజనీర్లు డిజైన్‌ చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు చెక్కుచెదరలేదని, సీఎం కేసీఆర్‌ స్వయంగా డిజైన్‌ చేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని విమర్శించారు.

క్షేత్ర స్థాయిలో సరైన సర్వే లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. డ్యామ్‌సేఫ్టీ యాక్ట్‌ 2021 కింద బాధ్యులపై కేసులు నమోదు చేయాలని జర్నలిస్టు జయసారథి డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో నిర్మించడంతోనే లోపాలు జరిగాయని రిటైర్డ్‌ ఇంజనీర్‌ రంగారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణానికి చాలా తేడాలున్నాయన్నారు.  

ప్రాణహితను ఎందుకు పక్కనపెట్టారు?
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టి కాళేశ్వరాన్ని కట్టారని రిటైర్డ్‌ ఇంజనీర్‌ రఘుమారెడ్డి ప్రశ్నించారు. రూ.లక్షాయాభై వేల కోట్లను నాశనం చేసిన పనికి బాధ్యులు ఎవరు? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సీజ్‌ చేయాలని, బాధ్యులైన ఇంజనీర్లు, అధికారులను జైలులో పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ చేపట్టాలన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు అయినా సరైన తనిఖీలు చేయకపోవడంతో సమస్యలొస్తున్నాయని రిటైర్డ్‌ ఇంజనీర్‌ శ్యాంప్రసాద్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అంటే కేసీఆర్‌ ఖజానా ఖాళీశ్వరమని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్, కోశాధికారి సురేశ్‌ పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement