మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్‌! | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్‌!

Published Sun, Mar 13 2022 2:19 AM

Gutta Sukhendarreddy Nominated As Chairman Of Legislative Counci - Sakshi

సాక్షి హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్‌ సెట్లు దాఖలు చేయనుండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. కాగా మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ పేరును కూడా సీఎం కేసీఆర్‌ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన తర్వాతే బండా ప్రకాశ్‌ పేరును ప్రకటించే అవకాశముంది. ఖాళీగా ఉన్న చీఫ్‌విప్‌తోపాటు, మూడు విప్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. 

రేపు ఎన్నిక: శాసనమండలి చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు శనివారం విడుదల చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ వివరాలను మండలి సభ్యులందరికీ పంపించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

ఇది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. 40 మంది సభ్యులున్న మండలిలో ఎంఐఎంకు ఉన్న ఇద్దరు సభ్యులతో కలుపుకుని టీఆర్‌ఎస్‌కు 38 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసే సభ్యుడు మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్‌ సోమవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి కూడా ఖాళీగా ఉండటంతో కొత్త చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక కోసం షెడ్యూల్, నోటిఫికేషన్‌ ప్రకటిస్తారు. ఈ నెల 15న డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.   

Advertisement
 
Advertisement