Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు

ED Notice Given To MLC Kavitha In Delhi Liquor Scam Case - Sakshi

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

రేపు విచారణకు రావాలన్న ఈడీ..

అప్రూవర్‌గా మారిన అరుణ్‌పిళ్లై ఏం చెప్పారు?

ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్‌ స్కాం​ కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. 

అరుణ్‌పిళ్లై ఏం చెప్పారు?
ఈ విచారణ సమయంలోనే అరుణ్‌ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. 

అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్‌..
ఇదిలా ఉండగా.. తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్‌ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెం‍బ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top