బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ఒక్కటే...

కాంగ్రెస్‌ పథకాల బ్రోచర్‌ను విడుదల చేసిన శ్యామ మహమ్మద్‌, నరేందర్‌  - Sakshi

మణికొండ: ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ కేసులో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయడంలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్యామ మహమ్మద్‌ ప్రశ్నించారు. రాజేంద్రనగర్‌ పార్టీ పరిశీలకురాలిగా ఉన్న ఆమె బుధవారం మణికొండలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు పొత్తులో ఉన్నందునే కవిత అరెస్టు జరగలేదన్నారు. పార్లమెంట్‌, రాజ్యసభలలో అనేక బిల్లులకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఆ ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టర్‌కు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున వాటాలు ఇచ్చినందునే మిన్నకున్నాయన్నారు. మూడు పార్టీల కూటమిని ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి కస్తూరి నరేందర్‌ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ప్రకాశ్‌గౌడ్‌ ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కనిపించటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు జితేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌కుమార్‌, నార్సింగి నేత అశోక్‌యాదవ్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

అందువల్లే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయలేదు

ఏఐసీసీ అధికారి ప్రతినిధి శ్యామ మహమ్మద్‌ ఆరోపణ

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top