పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!

In Order To Achieve Full Potential Of Dairy Milk Green Grass To Be Used - Sakshi

‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. 

రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్‌.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్‌ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్‌ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్‌ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు.

ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్‌ (ఇంగ్లీష్‌ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్‌ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్‌ నేపియర్‌ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్‌ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి.

శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు.  పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు.

వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్‌ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). 
– నిమ్మకాయల సతీష్‌ బాబు, సాక్షి, అమలాపురం

13 నుంచి సింహపురి సేంద్రియ మేళా
గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్‌ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488.

15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ
ఆదిగురు భారత్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్‌ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్‌ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top