టీ తోట నుంచి చైతన్యం  | Sakshi
Sakshi News home page

టీ తోట నుంచి చైతన్యం 

Published Wed, Aug 16 2023 12:15 AM

Armed With Awareness Women Tea Estate Workers Fight Back Against Gender Based Violence - Sakshi

పోష్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌) యాక్ట్‌ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్‌ సెల్‌ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు.  

ఒకరికొకరు అండగా 
మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్‌బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు.

ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్‌ సేఫ్టీ యాక్సెలరేటర్‌ ఫండ్‌ (డబ్లు్యఎస్‌ఏఎఫ్‌) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు.  
 


అస్సాం నుంచి కేరళ వరకు 
తమకు భద్రత కల్పించడానికి పోష్‌ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్‌’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్‌ సెల్‌ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు.

లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్‌ సెల్‌కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్‌ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
 
ఒక్క ఫోన్‌ కాల్‌ చాలు! 

పోష్‌ చట్టం ప్రకారం సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ రిడ్రసల్‌ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు.

టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్‌ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్‌ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది.

అలాగే రైతుబజార్‌లు, కూరగాయల మార్కెట్‌లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్‌ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్‌ విభాగానికి చెందిన ఫోన్‌ నంబర్‌ను ఆ మార్కెట్‌లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. 
 
ఒక నోడల్‌ పాయింట్‌
లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్‌లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్‌లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్‌ఏఎఫ్‌... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి 


చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి!
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్‌ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్‌ కంప్లయింట్స్‌ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్‌ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి.

ఫోన్‌ నంబర్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబర్‌లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్‌లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. 
– కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్, మెంబర్, లోకల్‌ కంప్లయింట్‌ కమిటీ, రంగారెడ్డి జిల్లా  

 
Advertisement
 
Advertisement