చేజేతులా తలవంపులు! | Sakshi
Sakshi News home page

చేజేతులా తలవంపులు!

Published Wed, Aug 30 2023 2:53 AM

Sakshi Editorial Column article On Wrestling Of India Today

విశ్వవేదికపై భారతదేశానికి కీర్తి, పతకాలు తెచ్చిపెట్టిన ఒక క్రీడ... ఇప్పుడు అంతర్జాతీయంగా నలుగురిలో నగుబాటుకు కారణంగా మారిందంటే తప్పెవరిది? గడచిన నాలుగు ఒలిపింక్స్‌లోనూ వరుసగా మన దేశానికి పతకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్‌లో ఆటగాళ్ళు ఇప్పుడు కనీసం భారత జాతీయ పతాకం నీడన అధికారికంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వీలు లేకుండా పోయిందంటే ఆ పాపం ఎవరిది? మన అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఏడాది మొదట్లో వీధికెక్కి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్లు్యఎఫ్‌ఐ) అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి గత ఎనిమిది నెలల్లో రోజుకో వివాదం మన రెజ్లింగ్‌ను చుట్టుముడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న భారత సమాఖ్యను అంతర్జాతీయ రెజ్లింగ్‌ పర్యవేక్షక సంఘం ‘యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌’ (యుడబ్లు్యడబ్లు్య) తాజాగా సస్పెండ్‌ చేసింది. నిర్ణీత గడువు లోగా ఎన్నికలు జరపనందుకు పడ్డ ఈ సస్పెన్షన్‌ వేటు మన రెజ్లింగ్‌ భవితపై నీలినీడలు పరిచింది.

ఈ సస్పెన్షన్‌ మరీ ఊహించనిదేమీ కాదు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ రెజ్లింగ్‌ సంఘం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. వివాదాల్లో కూరుకుపోయిన భారత రెజ్లింగ్‌ సమాఖ్యను చక్కదిద్దుకోవా ల్సిందిగా మన క్రీడాయంత్రాంగ పెద్దలను అభ్యర్థిస్తూనే ఉంది. దోవకు రాకుంటే సస్పెన్షన్‌ వేటు వేయక తప్పదని జూన్‌లో హెచ్చరించింది. జూలైలోనూ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో అంతర్గత వర్గ పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. మరోపక్క సమాఖ్య ఎన్నికల్ని వివిధ కోర్టులు నిలిపివేశాయి. చివరకు సహనం నశించిన అంతర్జాతీయ సంఘం అన్నంత పనీ చేసింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు వేసింది. సమస్యను ఆదిలోనే పరిష్కరించని మన క్రీడా అధికారుల అసమర్థత ఇక్కడి దాకా తెచ్చింది. 
ఈ సస్పెన్షన్‌ వల్ల ఆటగాళ్ళపై వ్యక్తిగతంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు. కానీ, దేశానికి మాత్రం తీరని తలవంపులు. ఎలాగంటే, ఈ సెప్టెంబర్‌ 16 నుంచి బెల్‌గ్రేడ్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మన రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగానే పోటీలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఇలా మన కుస్తీయోధులు అన్ని రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. పతకాలు సాధించవచ్చు. కానీ, జాతీయ పతాకం ధరించడానికి లేదు. సాక్షాత్తూ బంగారు పతకం సాధించి, పోడియమ్‌పై నిలబడినప్పటికీ ప్రాంగణంలో మన జాతీయ గీతాన్ని వినిపించరు. వారి ప్రతిభా ప్రదర్శన, గెలిచే పతకాలు... ఇలా ఏవీ భారతదేశపు లెక్కలోకి రావు. అదీ ఈ సస్పెన్షన్‌తో దాపురించే దుఃస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఎన్నికలు నిర్వహించకుంటే, దరిమిలా సస్పెన్షన్‌ను ఎత్తివేయ
కుంటే... అప్పుడిక మన భారత రెజ్లర్లు రానున్న ఒలింపిక్స్‌ సహా ఏ అంతర్జాతీయ పోటీలోనూ దేశం తరఫున పోటీ చేసే వీలుండదు. ఇది దేశ ప్రతిష్ఠకే మాయని మచ్చ. 

ఇందుకు నిందించాల్సింది మన భారత రెజ్లింగ్‌ సమాఖ్యను, మన పాలకులనే! లైంగికంగా వేధించినట్టు సాక్ష్యాధారాలు లభించినప్పటికీ, దేశానికి పతకాల పంట పండించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డున పడి ధర్నాలు చేసినప్పటికీ ఇవాళ్టికీ మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పాలక బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడైన బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవ డానికి ఇప్పటికీ మన పాలకులకు చేతులు రావడం లేదు. పేరుకు పదవిలో నుంచి పక్కకు తప్పు కున్నప్పటికీ, తన వారినే మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టి కథ నడిపించాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకొనేందుకు మన ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. బాధిత రెజ్లర్లకూ, చక్రం తిప్పాలని చూస్తున్న బడాచోర్లకూ మధ్య చిక్కుకున్నది కేవలం రెజ్లింగ్‌ కాదు... దేశ పరువు ప్రతిష్ఠలు! లైంగిక ఆరోపణల వ్యవహారంతో ఇప్పటికే దేశం పరువు పోగా, తాజా సస్పెన్షన్‌తో తలకొట్టేసినట్టయింది. 

రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడా సంఘాలు గనక రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. ఆటలు, ఆటగాళ్ళ ప్రయోజాల పరిరక్షణ వెనక్కి పోయి, క్రీడలతో సంబంధం లేని అంశాలు ముందుకు వస్తాయి. దేశంలోని అనేక ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే జరిగింది. సమయానికి ఎన్నికలు జరపలేదంటూ నిరుడు ప్రపంచ ఫుట్‌బాల్‌ పర్యవేక్షక సంఘం ‘ఫిఫా’ మనదేశ ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, హాకీ ఫెడరేషన్‌లు సైతం ఈ కారణాలతోనే మన సంఘాల్ని నిషేధిస్తామని హెచ్చరించాయి. క్రీడా నియమావళిని పాటించట్లేదంటూ సాక్షాత్తూ భారత సర్కారే 2020 జూన్‌లో 54 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును ఉపసంహరించింది. నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్ట్‌ గత ఏడాది దాదాపు పాతిక క్రీడాసంఘాలకు అక్షింతలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. రాజకీయాలకు బలవుతున్న సంఘాల్లో ఒకటిగా మన రెజ్లింగ్‌ సైతం నిలిచింది. 

విచిత్రంగా కొందరు ప్రస్తుత పరిస్థితికి ఆటగాళ్ళను తప్పుబడుతున్నారు. లైంగిక వేధింపుల అంశాన్ని బయటకు చెప్పడమే వారి నేరమన్నట్టుగా, వారిని ‘ధర్నా జీవులు’ అంటూ బ్రిజ్‌భూషణ్‌ నిస్సిగ్గుగా బురద జల్లుతున్నారు. ఇకనైనా పాలకులు, క్రీడా అధికారులు కళ్ళు తెరవాలి. దీర్ఘ కాలం సస్పెన్షన్‌ కొనసాగితే అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానాలు తగ్గుతాయి. ప్రపంచ సంఘం నుంచి ఆర్థిక సహకారమూ తగ్గుతుంది. ఆటగాళ్ళ కెరీర్‌ దెబ్బ తింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, సంక్షోభ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అలాకాక ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడకపోతే కష్టమే! దేశప్రతిష్ఠ కన్నా దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావిస్తే అది మహా పాపమే! 

Advertisement
Advertisement