పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్‌! | Sakshi
Sakshi News home page

పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్‌!

Published Tue, Jun 27 2023 4:18 AM

A pharmacy store in every village! - Sakshi

న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి.

ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ జనరల్‌ సెక్రటరీ రాజీవ్‌ సింఘాల్‌ తెలిపారు.

దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్‌ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్‌ ఉంది’’అని సింఘాల్‌ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం
పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్‌ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్‌ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్‌ ఏర్పడినట్టు చెప్పారు.

భారత ఫార్మా మార్కెట్‌లో టైర్‌–2 నుంచి టైర్‌–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్‌ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్‌ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్‌ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్‌ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు.

మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్‌ కైండ్‌ ఫార్మా వైస్‌ చైర్మన్, ఎండీ రాజీవ్‌ జునేజా వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి కృష్ణకుమార్‌ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్‌ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు. 

Advertisement
Advertisement