YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం | Sakshi
Sakshi News home page

YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం

Published Sat, Jul 31 2021 3:36 AM

YSRCP Government Social Justice Corporation Municipal Posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయాన్ని మరోమారు చేతల్లో చూపించింది. సంక్షేమ పథకాలే కాదు.. పదవుల పంపకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామని రుజువు చేసింది. నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లోనూ వారికే ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పాలక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 74 మునిసిపాలిటీల్లో శుక్రవారం రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో కోరం లేక రెండో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

నగర, పట్టణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్‌ చట్టాన్ని కూడా సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించేందుకు మునిసిపల్‌ పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. రాష్ట్రంలో 85 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు 24 మంది, ఎస్సీలు 22 మంది, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. ఈ లెక్కన 56 శాతం మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన మొత్తం 48 మంది రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయగా, 37 మంది ఓసీ కేటగిరి నుంచి ఆ స్థానాలు పొందారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ మద్దతుదారుడు రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

కేటాయింపునకు మించి..
వైఎస్సార్‌సీపీ గెలుపొందిన 12 మేయర్, 74 మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 పదవులను కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. నిజానికి చట్టప్రకారం 45 పదవులు కేటాయిస్తే సరిపోతుంది. కానీ జనరల్‌ కేటగిరిలోనూ బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇవ్వడమే కాకుండా మంత్రి వర్గంలోనూ 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అంతేకాకుండా 137 నామినేటెడ్‌ పదవుల్లో 58 శాతం మేర 79 పదవులు ఇచ్చారు. నామినేషన్‌ పనుల్లో 50 శాతం వారికి కేటాయించడంతో పాటు, వాటిలోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేసి సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 15 ఎమ్మెల్సీ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు, మున్సిపల్‌ మేయర్, చైర్‌ పర్సన్‌ పదవుల్లో 78 శాతం, వీటిలో 60.46 శాతం మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు తీసుకువచ్చి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనాన్ని చేతల్లో చూపించారు.


ఏలూరు మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం
ఏలూరు టౌన్‌: ఏలూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా బీసీ మహిళ షేక్‌ నూర్జహాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో మొదటి డిప్యూటీ మేయర్‌గా గుడిదేశి శ్రీనివాసరావు, రెండో డిప్యూటీ మేయర్‌గా నూకపెయ్యి సుధీర్‌బాబు, విప్‌గా పైడి భీమేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నూర్జహాన్‌ మేయర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. కోర్టు తీర్పు కారణంగా ఇక్కడ ఇటీవలే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే.  

 
Advertisement
 
Advertisement