చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌

Published Fri, May 10 2024 4:44 AM

High Court broke Chandrababu conspiracies

అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర

రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యార్థుల విద్యాదీవెనకూ మోకాలడ్డు

ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి.. నిధులను నిలిపేసిన బాబు

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటంతో ఊరట

10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం

నిధులు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులు 10 వరకూ నిలుపుదల

11 నుంచి 13 వరకు మాత్రం నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టీకరణ

నిధుల పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశం

ఆర్భాటాలు, సంబరాలు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు

న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ మధ్యంతర ఉత్తర్వులు

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశం

తదుపరి విచారణ జూన్‌ 27కి వాయిదా  

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలను హైకోర్టు పటాపంచలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకుని... కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని అలాంటప్పుడు దానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతులు పంపినా... చంద్రబాబు ఒత్తిడితో ఈసీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో బాబు కుట్రలు భగ్నమయ్యాయి. 

ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటునిచ్చినట్లయింది. 

నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు గానీ, సంబరాలు గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...  తదుపరి విచారణను జూన్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 
 


నిధుల కోసం కోర్టు తలుపుతట్టిన మహిళలు, రైతులు, విద్యార్థులు... 
ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులైన రైతులు, మహిళలు, విద్యార్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పథకాల కింద నిధులను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. 

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణమోహన్, నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ వినతిపత్రంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశింశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పోలింగ్‌ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. ఇప్పుడు నిధులు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందని తెలిపారు. 

అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతరం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయా పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘ఇవేమీ కొత్త పథకాలు కావు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు. వీటి ద్వారా లబ్దిదారులకు నిధులను పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమే అవుతుంది తప్ప, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదు. 

నిధుల పంపిణీకి అనుమతుల విషయంలో ఎన్నికల సంఘం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పసుపు కుంకుమ పథకం కింద నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆ పథకం ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతోందన్న కారణంతో నిధుల పంపిణీకి అనుమతిచ్చింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన విషయాన్ని ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఢిల్లీ హైకోర్టు ముందుంచిందని ఆయన వివరించారు. 

నిధుల పంపిణీపై ఎలాంటి ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారిని సైతం ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు నిధుల పంపిణీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ఏ పథకాల కింద అయితే నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ పథకాలలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) రావడానికి ముందే అమల్లో ఉన్నాయి. దీన్ని ఒకవైపు ఎన్నికల సంఘం అంగీకరిస్తూనే మరో వైపు నిధుల పంపిణీకి బ్రేక్‌ వేసింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ కింద లబ్దిదారులకు నిధుల పంపిణీని అడ్డు​కోవాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైందని, అయితే నిధుల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరించిందని ఆయన కోర్టుకు నివేదించారు. చంద్రబాబు హయాంలో ఓ రకంగా, ఇప్పుడు మరో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుందని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, అందుకు ప్రస్తుత నిర్ణయాలే ఉదాహరణని ఆయన తెలిపారు. 

నిధుల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుంది... 
ఈ నిధులు రాకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతిమంగా అది అప్పులు చేసే స్థితికి దారి తీస్తుందని ఆయన వివరించారు. నిధుల పంపిణీ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని, ప్రభుత్వం ఎక్కడా కూడా నిధుల పంపిణీపై ప్రకటనలు ఇవ్వడం గానీ, ప్రచారం చేసుకోవడం గానీ చేసే అవకాశం లేదన్నారు. నిధుల పంపిణీ ద్వారా లబ్ది పొందాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. గతంలో ఎప్పుడో ప్రకటించిన ఈ పథకాలకు ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. 

ఈ పథకాల గురించి ప్రజలందరికీ ఎప్పుడో తెలుసునని, ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని, కాబట్టి ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వం కొత్తగా పొందే లబ్ది గానీ, ప్రచారం గానీ ఏమీ ఉండదన్నారు. లబ్దిదారుల గుర్తింపు, నిధుల బదిలీ మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇందులో ప్రభుత్వానిది నామమాత్రపు పాత్రేనని వివరించారు. కాబట్టి అధికార పార్టీ లబ్ది పొందుతున్న వాదన అర్థరహితమని మోహన్‌రెడ్డి తెలిపారు. 

నిధుల లభ్యతను బట్టి పంపిణీ చేస్తూ వస్తున్నాం... 
అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం నిలుపుదల చేసిన పథకాలేవీ కొత్తవి కావన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అమలవుతన్నాయని, నిరి్ధష్ట సమయంలో నిధులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే ఈ పథకాలను ప్రకటించడం, లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. 

ఎన్నికల తేదీ దగ్గరలో ఉందని ఎన్నికల సంఘం ఇప్పుడు చెబుతోందని, వాస్తవానికి తాము ఎప్పుడో ఎన్నికల సంఘాన్ని నిధుల పంపిణీ కోసం అనుమతి కోరామని, అనుమతినివ్వడంలో సంఘం జాప్యం చేసిందని తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ ఉంటుందని, ఈ నాలుగేళ్లు అలాగే చేస్తూ వచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు భవిష్యత్తులో నగదుగా మార్చుకునే విధంగా లబ్దిదారులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చారని, అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం లేని పోని రాద్దాంతం చేస్తోందన్నారు. కొత్త పథకాలకు మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని చెప్పారు. 

మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకే... 
చివరగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోలింగ్‌ అయ్యేంత వరకు నిధుల పంపిణీని ఆపడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతినకుండా ఉండేందుకే నిధుల పంపిణీని ఆపాలంటూ ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఈ ఉత్తర్వులిచ్చామని చెప్పారు. ఎన్నికల నియమావళి కొత్త పథకాలతో పాటు పాత పథకాలకు సైతం వర్తిస్తుందని తెలిపారు. 

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందన్నారు. అందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే నిధుల పంపిణీని నిలుపుదల చేశామన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని ఆయన కోర్టును కోరారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ రాత్రి 10.20 గంటలకు ఉత్తర్వులు వెలువరించారు. ఈ వ్యాజ్యాలకున్న అత్యవసరం నేపథ్యంలో పూర్తి ఉత్తర్వుల కాపీ స్థానంలో అడ్వాన్స్‌ ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు. పూర్తి కాపీ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.   

Advertisement
 
Advertisement