3 ప్రాంతాల్లో క్యాన్సర్‌ ఆస్పత్రులు! | Sakshi
Sakshi News home page

3 ప్రాంతాల్లో క్యాన్సర్‌ ఆస్పత్రులు!

Published Wed, Sep 29 2021 3:15 AM

Cancer hospitals in 3 regions Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్‌ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు వివరాలను వెల్లడించారు. 

ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా...
రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు – నేడు, వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించాం. క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం ఆస్పత్రులు నెలకొల్పి అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌  సంకల్పించారు. వివిధ మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సలను దీనికిందకు తేవాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళిక. క్యాన్సర్‌ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం.

చిన్న గ్రామంలో క్యాన్సర్‌ రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే చికిత్స లభ్యమయ్యేలా చూడాలన్న ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగింది.  రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేయడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో సమావేశం కావడం ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్‌ చికిత్సకు గొప్ప అడుగు పడింది. సీఎం జగన్‌ ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి. మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం, కొత్తవి ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement