పట్టభద్రులు మోసపోవొద్దు | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు మోసపోవొద్దు

Published Tue, May 21 2024 5:10 AM

పట్టభద్రులు మోసపోవొద్దు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/ఇల్లెందు: శాసనమండలి నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని, పట్టభద్రులు మోసపోవొద్దని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో, ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆరు నెలల క్రితం అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మవద్దని, నమ్మితే ఘోస పడతారని చెప్పినా వినకుండా ప్రజలు మోసపోయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మోసపోకుండా ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్‌ మాయ అనుకుందామని, అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని అన్నారు. ఆరు నెలల క్రితం కొలువైన కాంగ్రెస్‌తోపాటు సీపీఐ ఇచ్చిన హామీలను ఎంతమేరకు పరిష్కరించారో అర్థం చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలను కాంగ్రెస్‌ పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం నాట్లు వేసే నాడు రైతుబంధు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓట్లు వేసే నాడు వేస్తోందని విమర్శించారు. డిసెంబర్‌ 9న రైతుబంధు ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందన్నారు. తాము అధికారం, పాలనను వికేంద్రీకరణ చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించామన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్‌లు అదానీకి అమ్మేస్తారని ఆరోపించారు.

అభ్యర్థుల చరిత్ర చూడాలి..

బీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పట్టభద్రులు అభ్యర్థుల చరిత్ర కూడా చూడాలన్నారు. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉండాలనే పుస్తకం రాసిన రాకేష్‌రెడ్డి ఒక వైపు ఉంటే, చీటర్‌, 56 కేసులున్న మల్లన్న మరోవైపు ఉన్నాడని తెలిపారు. మాజీ మంత్రి సత్యవతి మాట్లాడుతూ 5 నెలల క్రితం కాంగ్రెస్‌ ప్రజలను మాయమాటలతో మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ దామోదర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు దిండిగాల రాజేందర్‌, లక్కినేని సురేందర్‌, రంగనాథ్‌, దీపక్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈసారి కూడా మోసపోతే ఆ తప్పు మనదే అవుతుంది..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి

శాసనమండలి అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించాలి

కొత్తగూడెం, ఇల్లెందు సభల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

పదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం..

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రెండులక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను రాజీనామా చేస్తానని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో పూర్తయిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ఊదరగొట్టే వాగ్దానాలతో గెలిచిందని, అయితే ఈ ఐదారు నెలల్లో అందరికీ అర్థం అయ్యిందన్నారు. రాష్ట్రంలో మూడు మెడికల్‌ కళాశాలలు ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో 33 మెడికల్‌ కళాశాలలకు పెంచామని గుర్తుచేశారు. మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మంలో మెడికల్‌ కాలేజ్‌లు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేసి, ఉన్నత చదవువులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కొత్తగూడెంలో 140 మంది సూపర్‌స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇల్లెందు పట్టణ అభివృద్ధి ఘనత తమదేనన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అడిగే దమ్ము కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు ఉందా అని ప్రశ్నించారు. పట్టభద్రులు మోసపోకుండా రైతు బిడ్డ, ఉన్నత విద్యావంతుడైన రాకేష్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ పాల్వంచలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి పట్టభద్రులు తనను ఆదరించి చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement