ఏపీ, తెలంగాణలకు కేంద్రం కానుక

ఏపీ, తెలంగాణలకు కేంద్రం కానుక - Sakshi


న్యూఢిల్లీ:  వరంగల్ జిల్లా కాజీపేట నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా స్టేషన్ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని అంచనా వ్యయం 2,063 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి 2,403 కోట్ల రూపాయలు కావచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది.



201.4 కిలో మీటర్లు పొడవైన ఈ రైల్వే లైన్ ఐదేళ్లలో పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను కవర్ చేస్తుంది. ఈ మార్గంలో పవర్ ప్లాంట్స్, బొగ్గు, సిమెంట్ రవాణా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో లైన్ను మంజూరు చేశారు. న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ రూట్లో భాగంగా కాజీపేట-బల్లార్షా మూడో లైన్ ఉంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా  జమ్మికుంట ఎఫ్సీఐ, రాఘవపురం కేసోరామ్ సిమెంట్, మంచిర్యాల థర్మల్ పవర్ స్టేషన్, ఎస్సీసీఎల్ నుంచి గూడ్సును రవాణా చేస్తారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, రెచ్నిరోడ్ నుంచి బొగ్గు రవాణా.. మానిక్గఢ్, ఘట్చందూర్ నుంచి సిమెంట్ను ఇదే మార్గంలో రవాణా చేస్తారు.



ఆంధ్రప్రదేశ్లో విజయవాడ-గూడురు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ అనుమతి మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 3246 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదుల దాడి, మతకలహాలు, వామపక్ష తీవ్రవాదుల దాడి, మందుపాతర పేలుడు, సరిహద్దు వద్ద కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఈ ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తారు. అలాగే తీవ్రంగా గాయపడినవారికి కూడా పరిహారం ఇవ్వనున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top