పట్టుకుని చంపేశారా?

పట్టుకుని చంపేశారా? - Sakshi


ఏఓబీ ఎన్‌కౌంటర్ తీరుపై ఎన్నో అనుమానాలు

మూడంచెల భద్రత ఏమైందనే ప్రశ్న

తప్పించుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయనే వాదన

లొంగిపొమ్మన్నా వినకుండా కాల్పులు ప్రారంభించారన్న ఎస్పీలు

14 మృతదేహాల గుర్తింపు


మల్కన్‌గిరి నుంచి సాక్షి బృందం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఓబీలో ఎన్‌కౌంటర్ నిజంగా జరిగిందా? లేక మావోయిస్టుల శిబిరంపై దాడి చేసిన పోలీసులు మూకుమ్మడిగా, ఏకపక్షంగా కాల్చి చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం, జరిగిన తీరు, పోలీసుల కథనాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి పనసుపుట్టు పంచాయతీ రామగుడ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం మరో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు ఆ ప్రాంతంలో లభించినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మలు వెల్లడించారు. దీంతో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినవారి సంఖ్య 28కి చేరింది.

 

14 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏఓబీలో ఇంత భారీ ఎన్‌కౌంటర్ జరగడం ఇదే ప్రథమం. దీన్ని పోలీసులు గొప్పగా చెప్పుకుంటున్నా చనిపోయిన వారిలో చిన్నవయసు వారు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. మావోల శిబిరానికి సెంట్రీగా ఉన్న వ్యక్తి కూడా హతమయ్యాడు. దయ, గణేష్, మధు, బిర్సు, లత, రాజేష్, మమత, స్వరూప, రైనోలు మాత్రమే అగ్రశ్రేణి నేతలు. అయితే మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్‌కే కుమారుడు మున్నా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

 

అనుమానాలెన్నో..  

బలిమెల రిజర్వాయర్‌కు ఆనుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ, శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి మల్కన్‌గిరి నుంచి సుమారు 80- 90 కిలోమీటర్లు నదీ మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. విశాఖ ఏజెన్సీ నుంచయితే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణి స్తే తప్ప టార్గెట్ ప్రాంతానికి చేరుకోలేరు. అంత దూరం అడవుల్లో 200 మందికిపైగా పోలీసు బలగాలు ప్రయాణించి మావో శిబిరాన్ని చుట్టుముట్టే లోపు పసిగట్టేందుకు అవకాశాలు ఎక్కువ. కానీ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో పోలీసులు పొజిషన్ తీసుకొని లొంగిపొమ్మని హెచ్చరించే వరకు మావోలు పసిగట్టలేకపోవడం నమ్మశక్యంగా లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. కాల్పులు ప్రారంభమైన తరువాత కూడా కీకారణ్యంలో మావోయిస్టులు తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



పైగా శిక్షణ శిబిరాలు, ప్లీనరీల సమయాల్లో సదరు ప్రాంతాన్ని మావోయిస్టులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. కానీ సులువుగా పోలీసులకు చిక్కడం, తాము దాడికి సిద్ధమయ్యే సమయానికి సెంట్రీ డ్యూటీలో ఒక్క సభ్యుడే మెలకువగా ఉన్నాడని పోలీసులు చెబుతుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులపై పోలీసుల దాడి ఏకపక్షంగానే సాగిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు మూడు గంటల్లోపే అంతా ముగిసిపోవడం.. ఆ వెంటనే సంఘటన స్థలం నుంచి మృతదేహాలను కట్టకట్టి సమీప ప్రాంతానికి తరలింపు ఆగమేఘాలపై జరిగిపోవడం ఈ అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. సాధారణంగా భారీ ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు పోలీసు బలగాలు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లవు. అక్కడి పరిస్థితి పూర్తిగా తమ అదుపులోకి వచ్చిందని నిర్థారించుకున్నాకే అక్కడ అడుగుపెడతాయి.



మృతదేహాల తరలింపునకు రోజులు పట్టిన సందర్భాలు కూడా గతంలో చాలా ఉన్నాయి. కానీ సోమవారం నాటి ఘటనలో కేవలం గంటల వ్యవధిలోనే అంతమందిని హతమార్చడం, అక్కడ నుంచి మృతదేహాలను కట్టకట్టి హెలికాప్టర్లలో తరలించడంతో పాటు రాత్రివేళ మల్కన్‌గిరి పరిసరాల్లో వైద్యులను రప్పించి హడావుడిగా పోస్టుమార్టం పూర్తిచేసి ఐస్ ముక్కలతో మృతదేహాలను ప్యాక్ చేసి కంటెయినర్‌లో పడేయడం యుద్ధప్రాతిపదికన జరిగిపోయాయి. ఇదంతా చూస్తుంటే పక్కాగా ప్రణాళిక ప్రకారం మావోయిస్టులను నిస్సహాయులను చేసి నిద్రలో ఉన్నవారిని  శాశ్వత నిద్రలోకి పంపించినట్లు అర్థమవుతోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎదురుకాల్పులు జరిగితే పోలీసుల వైపు కూడా ఎంతో కొంత నష్టం జరిగి ఉండేదని, కనీసం ఎక్కువ మంది గాయపడైనా ఉండేవారని, ఇక్కడ అలాంటివేమీ జరగలేదని అంటున్నాయి.

 

మూడంచెల భద్రత ఏమైంది?

మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించేది వారి భద్రతా వ్యూహం. ఆర్‌కే, గణేష్, దయ, చలపతి వంటి అగ్రనేతలకు మూడంచెల భద్రత ఉంటుంది. కొద్దికాలం క్రితమే ఇందులోనూ అనేక మార్పులు చేశారు. మెరికల్లాంటి యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అగ్రనేతల భద్రతకు నియమించారు. కనీసం 50 మందితో కూడిన బృందం అగ్రనేతలకు రక్షణ వలయంగా ఉంటుంది. కూంబింగ్ పార్టీలు సమీపిస్తుంటే ఆ సమాచారం అగ్రనేతలకు ముందుగానే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు.



క్యాంప్‌లో కోరాపుట్ డివిజన్ సెక్రటరీ, జోనల్ కమిటీ మెంబర్ దయ, మరో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్, సీనియర్ అగ్రనేత వెంకటరమణ అలియాస్ గణేష్‌లు ఉన్నప్పటికీ కనీస రక్షణ కవచం కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముందుగా పట్టుకున్న తర్వాతే పోలీసులు హతమార్చి ఉంటారని స్పష్టంగా అర్థమవుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే లొంగిపొమ్మని హెచ్చరించినా వినకుండా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని మల్కన్‌గిరి, విశాఖ ఎస్పీలు మంగళవారం చెప్పారు.

 

అబూబకర్ మృతిపై సందేహాలు

ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్స్ కమెండో మహమ్మద్ అబూబకర్ చనిపోయాడని పోలీసులు చెబుతున్న మాటల్లో నిజం ఎంత అనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడమే దీనికి కారణం. ఎన్‌కౌంటర్‌కు ముందే.. ఆ ప్రాంతానికి చేరుకొనే లోపే వాగులో పడి అబూబకర్ మృతి చెందాడనే వాదన వినిపిస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top