ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే!






శ్రీకాకుళం జిల్లావాసి షణ్ముఖరావు

కామెర్లకు మందు వాడటంతో ఎత్తు పెరిగిపోయిన వైనం




రాజాం: ఎవరైనా పొడవుగా కనిపిస్తే ఆసక్తిగా చూస్తాం. ఏడడుగులు ఉంటే ఔరా అని ఆశ్చర్య పోతాం. ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు  ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ ప్రభావంతో కొంత మంది పొడవుగా పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షన్ముఖరావు ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉండేవాడు.



ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన చెందుతున్నాడు. పదో తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో.. కారులో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. రోడ్లో వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యానని ‘సాక్షి’తో తన గోడు వెల్లబోసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా.. పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగరిగా టర్కీకి చెందిన సుల్తాన్‌ కోసెన్‌(34) 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు.  షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్‌ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డుల్లోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యూఎస్‌ఏకు చెందిన రాబర్ట్‌ పర్షింగ్‌ వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top