విశాఖలో 100 కోట్ల దోపిడీకి స్కెచ్‌!

విశాఖలో 100 కోట్ల దోపిడీకి స్కెచ్‌!


-విశాఖ–భీమిలి రోడ్డు పనుల్లో భారీ కుంభకోణానికి వ్యూహం

- డయాఫ్రం వాల్‌ పేరుతో భారీగా అంచనాలు పెంపు

- రూ. 65 కోట్ల పనులు ఏకంగా రూ.195 కోట్లకు పెంపు

- ముఖ్యనేతకు రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చేలా ఒప్పందం

- నిబంధనలకు విరుద్ధంగా అదే సంస్థకు ఇవ్వాలంటూ సిఫార్సు

- ససేమిరా అన్న ఆర్థిక శాఖ... ఇంజనీర్ల కమిటీకి సిఫార్సు



సాక్షి, అమరావతి


రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ ‘దారి’ దోపిడీకి స్కెచ్‌ వేశారు. విశాఖ–భీమునిపట్నం రోడ్డు సాక్షిగా దాదాపు రూ.100 కోట్లు నొక్కేసేందుకు ముఖ్యనేత మంత్రాంగం చేశారు. అందుకోసం రూ.65కోట్ల అంచనాలున్న రోడ్డు పనులను రూ.195 కోట్లకు పెంచారు. భారీగా పెంచిన రోడ్డు పనులు ప్రస్తుత కాంట్రాక్టర్‌కే ఇచ్చేయాలని సిఫార్సు చేశారు. అయితే ఖజానా కొల్లగొట్టే చర్యలకు తాత్కాలికంగా ఆర్థిక శాఖ అడ్డుచక్రం వేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎటువంటి ఆమోదం తెలిపినా అక్రమం సక్రమం కాబోదని పేర్కొంది. డయాఫ్రం వాల్‌ పేరిట పెంచిన అంచనాలను పరిశీలించేందుకు ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యనేత రూ.100 కోట్ల దోపిడీ వ్యూహం ఇలా ఉంది...



డయాఫ్రం వాల్‌ పేరిట దోపిడీకి వ్యూహం

విశాఖపట్టణం నుంచి భీమునిపట్నం వరకు గల రహదారిలో పది కిలోమీటర్ల మేర అభివృద్ధికి తొలుత రూ.65 కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. ఆ మేరకు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే ఈ కాంట్రాక్టు నుంచి భారీగా ముడుపులు దండుకోవాలని ‘ముఖ్య’ నేత, విశాఖ జిల్లా మంత్రి కలిసి మంత్రాంగం చేశారు. ఆ మేరకు ఈ రహదారిలో తొలుత లేని డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రతిపాదన చేర్చారు. కొంత మేర మట్టితోను, 14,750 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌తో ఈ డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మట్టితో చేపట్టనున్న పనులకు క్యూబిక్‌ మీటర్‌కు సాధారణంగా 135 నుంచి 220 రూపాయల వరకు  వ్యయం అవుతుంది.



అయితే విశాఖ–భీమునిపట్నం రహదారిలో మట్టి క్యూబిక్‌ మీటర్‌కు రూ.870గా పేర్కొన్నారు. అలాగే కాంక్రీటు నిర్మాణానికి క్యూబిక్‌ మీటరుకు అయిదు వేల నుంచి ఆరు వేల రూపాయలు వ్యయం అవుతుంది. ఇక్కడ మాత్రం క్యూబిక్‌ మీటర్‌కు రూ.21,935 వ్యయం అవుతుందని పేర్కొన్నారు. అలా రూ.65 కోట్ల పనుల అంచనాను రూ.195 కోట్లకు చేర్చారు. పెరిగిన రూ.130 కోట్లలో రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా అయితే ప్రస్తుతం చేస్తున్న పనుల విలువ కన్నా 15 శాతం లోపు మాత్రమే పనులుంటే ఆ కాంట్రాక్టర్‌కే ఇచ్చే అవకాశం ఉంది. కానీ ముడుపుల ఒప్పందం కుదరడంతో... రూ.65 కోట్లు పనుల విలువ ఏకంగా రూ.195 కోట్లకు పెరిగినా ప్రస్తుత కాంట్రాక్ట్‌ సంస్థకే అప్పగించాలని ముఖ్యనేత నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సంబంధిత అధారిటీ ఆమోదం తెలిపిందంటూ ఆర్థిక శాఖకు రహదారులు–భవనాలు శాఖ ప్రతిపాదనలు పంపింది.



బ్రేకులేసిన ఆర్థిక శాఖ

ప్రభుత్వ పెద్దల వ్యూహంలో భాగంగా రహదారులు–భవనాల శాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. పెరిగిన మొత్తానికి టెండర్లు పిలవకుండా ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కే ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద మొత్తంలో పనులు పెరిగినందున ఆ పనులకు టెండర్లను ఆహ్వానించాల్సి ఉందని స్పష్టం చేసింది. అంతే కాకుండా సంబంధిత అధారిటీ పనులకు ఆమోదం తెలిపినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఎటువంటి ఆమోదం తెలిపినా అక్రమం సక్రమం కాదని పేర్కొంది. పనులు విలువ పెరగడానికి ప్రధాన కారణమైన డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పోలవరం ప్రాజెక్టులో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ఇంజనీర్ల కమిటీకి పంపించింది. ఇంజనీర్ల కమిటీ నివేదిక వచ్చిన తరువాత అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనుంది.



గతంలో కృష్ణా పుష్కరాల పనులను పరిపాలన అనుమతి లేకుండా నామినేషన్‌పై ఇచ్చేసి ఆ తరువాత బిల్లులు చెల్లించాలంటూ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అందుకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏకంగా కేబినెట్‌ సమావేశంలో పెట్టి అక్రమాన్ని సక్రమం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను కూడా నామినేషన్‌పై ఇచ్చేసి ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖ–భీమునిపట్నం ‘దారి’ దోపిడీలో ఆర్థిక శాఖ తీవ్ర పదాలను వినియోగించింది. అయినా ప్రభుత్వ పెద్దలు ఏమి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.



డయాఫ్రం వాల్‌ అంటే...

భూకంపాలు వచ్చినా, అలలు భారీ ఎత్తున ఎగిసిపడినా తట్టుకునే విధంగా నిర్మించే పునాదివంటి నిర్మాణాన్నే డయాఫ్రం వాల్‌ అంటారు. ఈ పద్ధతిలో పెద్దపెద్ద గ్రాబర్లు, కట్టర్లతో భూమిని తవ్వుతూ... తవ్విన మట్టి కిందకు పడకుండా బెంటనైట్‌ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్‌ను పంపితే కొంత బెంటనైట్‌ మిశ్రమం కలవగా, మిగతాది బయటకు వస్తుంది. కాంక్రీట్‌తో బెంటనైట్‌ కలవడంతో దాన్ని ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ అంటారు. ఇది అత్యంత పటిష్టంగా ఉంటుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top