ఆయనతో కలిసుండాలని ఉంది!

ఆయనతో కలిసుండాలని ఉంది! - Sakshi


* ఒక్కసారి పిలిస్తే చాలు.. జీవితాంతం తోడుంటాను

* మోదీ భార్య జశోదాబెన్ ఆకాంక్ష





ముంబై/అహ్మదాబాద్: ‘ఆయనతో కలిసుండాలనే నాకుంది. తనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉంది. నాకు ఆ ఆశ ఎప్పట్నుంచో ఉంది. తనకు సేవ చేయాలని ఉంది. ఒక్కసారి రమ్మని పిలిస్తే చాలు.. సంతోషంగా వెంట వెళ్తాను. నేనుంటు న్న ఇంటి దగ్గరికి వచ్చి తనతో రమ్మని ఒక్కసారి ఆహ్వానిస్తే.. మరుక్షణమే ఆయన తోడుగా వెళ్తాను. జీవితాంతం తోడుంటాను. కానీ ముందు ఆయన నన్ను పిలవాలిగా!’ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదా బెన్(64) ఆకాంక్ష ఇది. 43 ఏళ్లుగా విడిగా ఉంటున్నా.. భర్తపై మమకారం తగ్గలేదని, తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదాబెన్ చెబుతున్నా రు. ఇప్పటికీ వారంలో 4రోజులు ఆమె ఉపవాసం ఉంటారు.  



విడిపోయి 43 ఏళ్లు

1968లో మోదీకి 17 ఏళ్ల వయసులో జశోదాతో వివాహమయింది. మూడేళ్ల తరువాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో చదువుకుని గుజరాత్‌లోని వాద్గం జిల్లా, రాజోషన గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా జశోదాబెన్ కొత్త జీవితం ప్రారంభించారు. వారిద్దరూ విడిపోయి దాదాపు 43 ఏళ్లు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి కానీ, భార్య గురించి కానీ మోదీ ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించలేదు.



వడోదర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పేరు జశోదాబెన్ అని తొలిసారి వెల్లడించారు. అఫిడవిట్‌లో భార్యగా తన పేరును మోదీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను మిడ్‌డే పత్రికతో ఆమె పంచుకున్నారు. ‘చాలా సంతోషమయింది. నా కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. నాకు తెలుసు. ఆయనకు నేనంటే ఇష్టమే. తన హృదయంలో నాపై ప్రేమ ఉంది. అందుకే ఆయన నా పేరు రాశారు’ అన్నారు.  



నేను ఆటోలో.. సెక్యూరిటీ వారు వెనక కార్లో..!

మోదీ ప్రధాని అయిన తరువాత తనకు ఏర్పాటు చేసిన భద్రత తనకు ఇబ్బందిగా మారిందని జశోదాబెన్ చెప్పారు. మే 30 నుంచి గుజరాత్ పోలీస్‌కు చెందిన ఐదుగురు అధికారులు ఆమెకు ఎస్కార్ట్‌గా వస్తున్నారు. జశోదాబెన్ ఆటోలో వెళ్తుంటే.. వారు వెనక కార్లో ఫాలో చేస్తుంటారు. ‘ఎక్కడికెళ్లినా వస్తున్నారు. చిరాగ్గా ఉంది’ అని ఆమె విసుక్కున్నారు.



ఆర్టీఐకి దరఖాస్తు

ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రత వివరాలను తెలపాల్సిందిగా జశోదాబెన్ సోమవారం సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘నేను ప్రధానమంత్రి భార్యను. ప్రొటోకాల్ ప్రకారం నాకందిస్తున్న సెక్యూరిటీ వివరాలను తెలపండి’ అని ఆమె కోరారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులే చంపేశారు. నాకిస్తున్న సెక్యూరిటీ విషయంలో నేను భయపడ్తున్నాను. నాకు సెక్యూరటీగా వస్తున్నవారి పూర్తి వివరాలు నాక్కావాలి’ అని ఆమె అందులో అభ్యర్థించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top