స్మార్ట్ ఫోన్లు వాడుతూ.. దొరికేశారు!

స్మార్ట్ ఫోన్లు వాడుతూ.. దొరికేశారు!

అత్యంత క్రమశిక్షణతో ఉండే సైనిక దళాల్లో స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు సరికొత్త తలనొప్పిగా తయారయ్యాయి. పలువురు జవాన్లు ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం, అవి ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ప్రముఖంగా వస్తుండటంతో స్మార్ట్ ఫోన్లు, ఇతర సమాచార షేరింగ్ పరికరాల వాడకంపై ఇప్పటికే ఉన్న నియమ నిబంధనల మీద వెంటనే సమీక్ష జరపాలని, ఆ నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ఆర్మీ నిర్ణయించింది. ఆ మేరకు ఇటీవల ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఒక సర్‌ప్రైజ్ చెక్ చేయగా, ఏకంగా 80 మంది అధికారులు అనధికారికంగా స్మార్ట్ ఫోన్లు వాడుతూ దొరికేశారు. బ్రిగెడియర్, కల్నల్ ర్యాంకు అధికారుల వద్ద కూడా ఉన్న స్మార్ట్ ఫోన్లను వెంటనే స్వాధీనం చేసుకున్నారు. స్వయానా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆదేశాలు జారీ చేయడంతో ఏ ఒక్కరూ కిక్కురుమనే సాహసం చేయలేదు. 

 

ఆర్మీ ప్రధాన కార్యాలయం, సౌత్ బ్లాక్, కశ్మీర్ హౌస్, ఎల్ అండ్ ఎం బ్లాకు, సేనా భవన్, ఆర్కే పురం తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. వీటికోసం పలు ఫ్లయింగ్ స్క్వాడ్లను జనరల్ రావత్ నియమించారు. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా లీక్ చేసే ప్రమాదం ఉన్నందున వీటిని వాడకూడదని ఎప్పటి నుంచో ఆంక్షలున్నాయి. వాటిని కాదని అలాంటి ఫోన్లు వాడుతున్న అధికారులను ఇప్పటికే హెచ్చరించారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఇతర సంస్థల ప్రాంగణాల్లో కేవలం మేజర్ జనరల్, అంతకంటే పెద్ద ర్యాంకులలో ఉన్న అధికారులకు మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉంచుకోడానికి, ఉపయోగించడానికి అనుమతి ఉంది. కానీ చాలామంది జూనియర్ ఆఫీసర్లు కూడా దాన్ని కావాలనే ఉల్లంఘిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇలా జరగడంతో రహస్య సమాచారం బయటకు వెళ్తోందన్న అనుమానాలున్నాయి. 

 

సోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని, దాని ద్వారా ఎంత మంచి జరిగే అవకాశం ఉందో అంతే చెడు కూడా జరగొచ్చని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైబర్ దాడులను అడ్డుకునే సామర్థ్యం భారత ఆర్మీకి ఉందని, కానీ సోషల్ మీడియా ద్వారా వచ్చే శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఇటీవల ఆర్మీడే సందర్భంగా కూడా ఆయన తెలిపారు. ఆర్మీ అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ సంస్థ ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా సైన్యానికి వల వేస్తున్న విషయం ఇటీవలే బయటపడింది.  
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top