'ఆ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా'

'ఆ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా'


కైరో: ఎన్ని కష్టాలు ఎదురైనా మనం చేపట్టిన పని కొనసాగించుకుంటూ వెళ్లి పోవాలని... ఎక్కడా ఆపకూడదని బిగ్బీ అమితాబ్ స్పష్టం చేశారు. కొనసాగిస్తున్న పనిని ఓ వేళ ఆపితే జీవితం అయిపోనట్లే అని భావించాలన్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఇండియా బై ది నైలు' ఫెస్టివల్లో అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ను  ఈజిప్టులోని భారతీయ సమాజం సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించింది.


ఈ సందర్భంగా ఎన్నారైలతో అమితాబ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు అమితాబ్ సమాధానం ఇస్తూ...  తన జీవితంలో ఎదురైన పలు సమస్యలను ఎలా అధిగమించుకుంటూ వచ్చిన తీరును వారికి వివరించారు. 2000 ఏడాదిలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు... వాటిని తాను ఏ విధంగా ఎదురొడ్డి నిలిచి పోరాడినది ఆయన విశదీకరించారు.


ఈ రోజు మీ ముందు ఇలా నిండైన వ్యక్తిత్వంతో నిలబడి ఉన్నానంటే అందుకు 2000 నాటి సమస్యలు ఓ కారణమని అమితాబ్  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈజిప్టులో భారత రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ... అమితాబ్ తన అమూల్యమైన సమయాన్ని విదేశంలోని భారతీయుల కోసం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్బంగా అమితాబ్కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.



భారత్ విదేశీ పర్యాటకులకు స్వర్గధామం అనే ముఖ్య ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఈజిప్టులో ఇండియా బై ది నైలు పండగను నిర్వహిస్తుంది. ఈ పండగ 18 రోజుల పాటు జరగనుంది. అందులోభాగంగా అమితాబ్ 3 రోజుల పాటు ఈజిప్టులో పర్యటిస్తున్నారు. భారత్లో పర్యటించే విదేశీ పర్యాటకుల వల్ల కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. అయితే భారత్లో తీవ్రవాదుల దాడులు వల్ల ఈజిప్టు వాసులు పర్యటించే సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్రం... ఇండియా బై ది నైలు పండగను నిర్వహిస్తుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top