సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్


న్యూఢిల్లీ: ఉత్కంఠకు తెరదించుతూ...  సీబీఐ డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ(59)ను కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలచేసింది. వర్మ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున్  ఖర్గేలతో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీ అనుమతినిచ్చింది. అయితే సీబీఐలో వర్మ ఎన్నడూ పనిచేయలేదని అభ్యంతరం తెలుపుతూ జనవరి 16న జరిగిన కమిటీ సమావేశంలో ఖర్గే అసమ్మతి తెలియచేసినట్లు సమాచారం.



తీహార్‌ జైలు డీజీగా పనిచేసిన వర్మ: అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, మిజోరం రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్‌ 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వర్మ ఢిల్లీ పోలీస్‌ శాఖతో పాటు, అండమాన్  నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, మిజోరం రాష్ట్రాలతో పాటు ఇంటెలిజెన్స్  బ్యూరోలో పనిచేశారు. తీహార్‌ జైలు డీజీగా కూడా కొన్నాళ్లు వ్యవహరించారు. ఫిబ్రవరి 29, 2016 నుంచి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  డిసెంబర్‌ 2న అనిల్‌ సిన్హా పదవీ విరమణ చేయడంతో అప్పటి సీబీఐ డైరెక్టర్‌ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ ఆస్థానా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.


సీబీఐ డెరైక్టర్‌ పదవి కోసం 45 మంది ఐపీఎస్‌ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇండో టిబెటన్  సరిహద్దు పోలీస్‌ డీజీ కృష్ణ చౌదరి, మహారాష్ట్ర డీజీపీ ఎస్‌సీ మా«థుర్, హైదరాబాద్‌లోని lనేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) డైరెక్టర్‌ అరుణా బహుగుణ పేర్లు వినిపించాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top