మహిళలను అనుమతించవద్దంటూ ఆదేశాలు

మహిళలను అనుమతించవద్దంటూ ఆదేశాలు


హుండీ లెక్కింపునకు మహిళలు దూరం

వేములవాడ: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హుండీ లెక్కింపులో అనుసరిస్తున్న విధానాలపై సీరియస్‌గా వ్యవహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్బంగా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని నిబంధన పెట్టారు. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో డి.రాజేశ్వర్‌ హుండీ లెక్కింపులో ఎలాంటి పరిస్థితుల్లోనూ మహిళలను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇంతేకాకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తప్ప ఇతర దేవాదాయశాఖకు సంబంధంలేని వారిని దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.



హుండీ లెక్కింపు సందర్భంగా కొందరు బంగారం, నగదును దోచుకున్నట్లు, దాచుకున్నట్లు విచారణలో తేలడంతో కమిషనర్‌ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ ఉద్యోగులెవ్వరూ హుండీ లెక్కింపు రోజున సెలవులు పెట్టొద్దనీ, అలా పాల్పడినట్లైతే గైర్హాజరు వేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. హుండీ లెక్కింపు సందర్బంగా రాష్ట్ర దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయానికి భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల జీతాలు పుచ్చుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది హుండీ లెక్కింపులో భాగస్వాములు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులను అనుమతించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధమైన చర్యలకు అవకాశం కల్పించినట్లవుతుందన్న చర్చ సాగుతోంది. అయితే కొంత మంది ఉద్యోగులు తమతమ పలుకుబడిని ఉపయోగించుకుని హుండీ లెక్కింపులో హాజరు కాకుండా చూసుకుంటున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు, మంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం.



3న హుండీ లెక్కింపు వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు వచ్చేనెల 3న ఉదయం 7.30 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు ఈవో రాజేశ్వర్‌ తెలిపారు. ఉద్యోగులంతా విధిగా లుంగీ, ధోవతి మాత్రమే ధరించి రావాలనీ, బనియన్‌ సైతం వేసుకోకుండా హుండీ లెక్కింపులో హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా మరింత భద్రత పెంచుతామనీ, సీసీ కెమెరాల నిఘా సైతం పెంచినట్లు ఆయన చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top