పని చేయకుంటే ‘బ్లాక్ లిస్టే’


ఖమ్మం : నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానా విధించడంతోపాటు పేర్లు బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో జిల్లా అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్, జిల్లా పరిషత్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌లతో కలిసి మంత్రి తుమ్మల సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.


కాకతీయ మిషన్ పనుల్లో చెరువు పూడిక పనులకంటే ముందు సిమెంటు పనులు పూర్తిచేయాలన్నారు. మొదటి దశలో 851 పనులకు.. 801 పనులు పూర్తయ్యాయని, రెండో దశలో 927 పనులు మంజూరు చేయగా.. 41 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 865 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జూన్ 15 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా 4,517 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో చెరువుల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు.


పాలెం వాగు పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. దీనిద్వారా 12,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెక్‌డ్యామ్ పనులను వేగవంతం చేయాలని, పదిహేను రోజుల్లో సేఫ్ లెవల్ వంతెన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భగీరథ పనులతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయవద్దన్నారు. 740 గ్రామాలకు డిసెంబర్ నాటికి తాగునీరు అందిస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ పనితీరు సరిగా లేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథలో పర్ణశాల, పూసూరు, కూసుమంచి ఇన్‌టేక్, వాటర్ టెస్టింగ్ ప్లాంటును సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు భూసేకరణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top