రాష్ట్రాభివృద్ధికి కార్పొరేట్‌లు తోడ్పడాలి

రాష్ట్రాభివృద్ధికి కార్పొరేట్‌లు తోడ్పడాలి - Sakshi


‘సెయైంట్’ డిజిటల్ సెంటర్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్

 

 సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో మరిన్ని సంస్థలు పాలుపంచుకోవాలని, రాష్ట్రాభివృద్ధిలోనూ తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. సెయైంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ రజతోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని 54 పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వాటిని కేటీఆర్ ప్రారంభించారు.



ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట వచ్చిన ఆలోచనే ప్రస్తుతం సెయైంట్ వంటి సంస్థ ఏర్పడటానికి కారణమైందన్నారు. ఒక వ్యక్తి తలచుకుంటే ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతారని... సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి భారతీయులు అసాధారణ తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు నాయకత్వం వహిస్తూ స్ఫూర్తిగా నిలవడానికి చదువే కారణమన్నారు. అందుకే విద్యార్థులంతా శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తరువాత ప్రస్తుతం డిజిటల్ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. సెయైంట్ తరహాలోనే ఇతర కార్పొరేట్ సంస్థలూ ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.



 54 స్కూళ్లలో డిజిటల్ లిటరసీ సెంటర్లు

 రాష్ట్రంలో ఐటీ పాలసీకి ఆకర్షితులై ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని సెయైంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గతంలో తాము 16 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించామని, తద్వారా ఆ పాఠశాలల్లో బాలికల ఎన్‌రోల్‌మెంట్, ఉత్తీర్ణత శాతం పెరిగి డ్రాపవుట్ల శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం 54 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశంలో కీలకంగా మారడానికి తెలంగాణ ప్రభుత్వం, కే టీఆర్ కృషే కారణమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

 

 చదువంటే ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే లక్ష్యం: ఈటల

 తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చి నిధులు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంతోపాటు సమాజంలో అసమానతలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. చదువంటే శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల్లోనే కాదని.. చదువంటే జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను, కేటీఆర్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు రూ. 180 కోట్లు వెచ్చించి రంగారెడ్డి జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top