లంచావతారులు!


సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫోన్ నంబర్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ఫోన్‌కాల్స్ 10,750

అవినీతిపై వచ్చిన కాల్స్ 499

అవినీతిలో మునిగిన ప్రభుత్వ యంత్రాంగం

పలు సమస్యలతో పాటు అవినీతిపై 499 ఫిర్యాదులు

ఎమ్మెల్యేలు మొదలుకొని వీఆర్వోల వరకు అక్రమార్కులే

అధికారుల లైంగిక వేధింపులపైనా ఆరోపణలు

ఫిర్యాదులపై ఆరా తీసిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్

వారం రోజుల్లో ఏసీబీకి అందనున్న సమగ్ర నివేదిక

సీఎంవో నిర్వాకంతో ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతం




సాక్షి, హైదరాబాద్: అవినీతిపై రాష్ర్ట ప్రజలు గళం విప్పారు. అక్రమార్జనలో ఆరితేరిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బందిపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శుల వరకు విధుల్లో భాగంగా వెలగబెడుతున్న అవినీతి బాగోతాన్ని కుప్పలుతెప్పలుగా బయటపెడుతున్నారు.



ప్రభుత్వ పథకాల అమలులో లంచావతారుల ఆగడాలపై సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించిన ఫోన్ నంబర్(040-23254071)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే అవినీతిపరుల పేర్ల చిట్టా చాంతాడంత తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం అక్రమాలపై సగటున గంటకు ఐదు.. రోజుకు 125 ఫిర్యాదులు అందుతున్నాయి. సీఎం కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 10,750 కాల్స్ అందగా.. వాటిలో 499 కాల్స్ అవినీతికి సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర సమస్యలను మొరపెట్టుకున్నారు.



కాగా, అవినీతిపై అందిన ఫిర్యాదుల్లో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రేషన్‌కార్డులు, సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పట్టాదారు పాసు పుస్తకాలు, పౌర సరఫరాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, ఆధార్‌కార్డుల జారీ తదితర అనేక పథకాల్లో ప్రభుత్వ సిబ్బంది లంచాల కోసం వేధిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల లైంగిక వేధింపులను కూడా కొందరు వెల్లడించారు.



రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం కోఠిలోని ఆరోగ్యశ్రీ కాల్ సెంటర్‌ను సందర్శించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసింది. ఈ బృందంలో ఏబీసీ జేడీ ఎన్‌వీ శ్రీనివాస్, డీఎస్పీలు అశోక్ కుమార్, రవికుమార్, నరేందర్ రెడ్డి ఉన్నారు. అవినీతిపై అందిన ఫిర్యాదులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని కాల్‌సెంటర్ జనరల్ మేనేజర్‌ను ఏసీబీ అధికారులు కోరారు. సమాచార సేకరణ కోసం నిర్ణీత ఫార్మాట్‌ను అందజేశారు.



ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవు: ఖాన్

ఫిర్యాదుదారుడి ఫోన్ కాల్ ఆధారంగా లంచం అడిగినట్లు బలమైన ఆధారాలు లభిస్తే సదరు ఉద్యోగి లేదా అధికారిని సస్పెండ్ చేస్తామని ఏకే ఖాన్ తెలిపారు. జైలు శిక్ష కూడా తప్పదన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు ఏసీబీ కృషి చేస్తుందన్నారు. మిగతా ఫిర్యాదులను జిల్లాలవారీగా జిల్లా ఏసీబీ డిఎస్పీ కార్యాలయాలకు పంపుతామని తెలిపారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ద్వారా కేసుల విచారణను సమీక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అవినీతి రహితంగా అందించేందుకు అధికారుల్లో మార్పు రావాలన్నారు. ఫిర్యాదుల సేకరణ కోసం నాలుగు ఏసీబీ బృందాలను ఏర్పాటు చేస్తామని, అవినీతికి సంబంధించిన కేసులనే తాము పరిశీలిస్తామని తెలిపారు.



మీడియాకు ఫిర్యాదుదారుల వివరాలు

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏర్పాటైన ప్రత్యేక ఫోన్ నంబర్‌కు అవినీతిపై ఫిర్యాదు చేసిన ప్రజల వివరాలు బహిర్గతమయ్యాయి. సీఎం కార్యాలయం ప్రచార విభాగం అధికారుల నిర్వాకంతో ఈ పొరపాటు జరిగింది. అవినీతిపై సామాన్యుల నుంచి అందిన ఫిర్యాదుల సమగ్ర సమాచారాన్ని కాల్‌సెంటర్ నుంచి తెప్పించుకున్న సీఎంవో వర్గాలు.. దాన్ని పూర్తిగా పరిశీలించి చూడకుండానే పాత్రికేయులకు విడుదల చేశాయి. అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఈ-డాక్యుమెంట్లలో ఫిర్యాదు చేసిన వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఎవరిపై ఫిర్యాదు చేశారు తదితర సమాచారం కూడా ఉంది. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన సీఎం కార్యాలయం ఈ విషయంలో విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



సర్కారుకు అందిన కొన్ని ఫిర్యాదులు

* మహబూబ్‌నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంత ఎమ్మెల్యే ఒకరు పింఛన్ల మంజూరు కోసం లంచాలు వసూలు చేస్తున్నారు.

* మెదక్ జిల్లాలోని వెనకబడిన ప్రాంత ఎమ్మెల్యే ఒకరు డబ్బులు అడుగుతున్నారు.

* మెదక్ జిల్లా వైద్యాధికారి ఒకరు లంచాల కోసం వేధిస్తున్నారు. ఓ అదనపు వైద్యాధికారీ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు.



* ఎస్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు లంచాలు వసూలు చేస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు.

* ఉస్మానియా ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది రోగులను డబ్బులు అడుగుతున్నారు. చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

* భూమి రిజిస్ట్రేషన్‌కు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర మండల డిప్యూటీ తహసీల్దార్ రూ. 5,000 లంచం అడుగుతున్నారు.



* వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం నల్లగొండ జిల్లా నేరేడుచర్ల ఎంపీడీవో రూ. 5,000 లంచం అడిగారు.

* నల్లగొండ జిల్లా నిడ్మనూరు మండలం ఉట్కూరులో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కోసం విద్యుత్ శాఖ హెల్పర్ లంచం అడిగాడు.

* నల్లగొండ వీఆర్‌వోకు డబ్బులు చెల్లించినా రేషన్ కార్డు జారీ చేయలేదు.



* మెదక్ జిల్లా కోహిర్ సబ్‌స్టేషన్ కాంట్రాక్టు ఉద్యోగి జీతం నుంచి ‘శబరి ఎలక్ట్రికల్స్’ అనే కాంట్రాక్టు సంస్థ ప్రతి నెలా రూ. వెయ్యి మిగుల్చుకుంటోంది. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోంది.



* కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల కోసం వైద్యులు రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలు వసూలు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top