మన మెట్రో స్మార్ట్‌

Telangana Govt start metro train service will be start soon - Sakshi

► మెట్రో స్మార్ట్‌ కార్డుతో ఓలా, ఉబెర్‌లోనూ ప్రయాణం
► దేశంలో నంబర్‌వన్‌గా హైదరాబాద్‌ మెట్రో: కేటీఆర్‌
► ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం
► నవంబర్‌ చివరిలో ప్రధాని షెడ్యూల్‌ కోసం చూస్తున్నాం
► మియాపూర్‌ మెట్రో డిపోలో ప్రారంభానికి సన్నాహాలు
► స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ ఎలక్ట్రిక్‌ బస్సులు
► త్వరలో టికెట్‌ చార్జీలు, కామన్‌ టికెట్‌ విధివిధానాల ఖరారు.. నూతన పార్కింగ్‌ పాలసీ ప్రకటిస్తాం
► రెండో దశపై కసరత్తు పూర్తి.. కేబినెట్‌ ఆమోదమే తరువాయి

 
సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లతోపాటు ఉబెర్, ఓలా క్యాబుల్లోనూ ప్రయాణించేందుకు వీలుగా కామన్‌ స్మార్ట్‌కార్డును నగరవాసుల కోసం అమల్లోకి తీసుకొస్తామని, దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తామని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ప్రతి మెట్రో స్టేషన్‌కు సమీపంలోని బస్సు, రైల్వేస్టేషన్లను ఆకాశమార్గాల (ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి)తో అనుసంధానిస్తామన్నారు. గురువారం సికింద్రాబాద్‌ రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌ను, దానికి ఆనుకుని ఇంజనీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్న ఒలిఫెంటా మెట్రో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ విశిష్టతలను ఆయన పరిశీలించారు. అనంతరం కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రత, వసతులపరంగా దేశంలో నంబర్‌వన్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రోను తీర్చిదిద్దుతున్నామన్నారు.

ప్రధాని రాకకోసం వేచి చూస్తున్నాం
ప్రపంచంలోనే పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో రైలు అని, మెట్రో తొలి దశను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. నవంబర్‌ చివరి వారంలో మోదీ షెడ్యూల్‌ కోసం వేచి చూస్తున్నామని, ప్రధాని సూచన మేరకు ప్రారంభ తేదీల్లో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు. మియాపూర్‌ మెట్రో డిపోలో ప్రారంభోత్సవం, అక్కడి నుంచి అమీర్‌పేట్‌ వరకు మెట్రో రైలులో ప్రధాని ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని సూచనప్రాయంగా చెప్పారు. అనేక సవాళ్లను ఎదుర్కొని రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రధాని తప్పక నగరానికి విచ్చేస్తారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. కొచ్చి, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో స్వల్ప దూరాలకు మాత్రమే మెట్రో రైళ్లను ప్రారంభించారని.. అదే రీతిన నగరంలో మెట్రో ప్రారంభించాలనుకుంటే రెండేళ్ల క్రితమే చేసేవారమని, ప్రజలకు ఉపయుక్తం కాదన్న ఉద్దేశంతోనే నాగోల్‌–మెట్టుగూడ(8కి.మీ.) మార్గంలో రైళ్ల రాకపోకలను ప్రారంభించలేదని స్పష్టం చేశారు. స్వల్ప దూరానికి మెట్రో రైళ్లను నడిపి మమ అనిపిస్తే ఈ ప్రాజెక్టు విఫలమైందన్న సంకేతాలు వెలువడతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్‌ చివరివారంలో నాగోల్‌–అమీర్‌పేట్‌(17కి.మీ.), అమీర్‌పేట్‌–ఎస్‌ఆర్‌నగర్‌ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతామన్నారు. మెట్రో రైలు టికెట్‌ చార్జీలను పక్షం రోజుల్లో ఖరారు చేస్తామన్నారు.

ఓల్డ్‌సిటీ మెట్రో మార్గాన్ని ఖరారు చేస్తాం
ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో.. పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్‌పై వివిధ రాజకీయ పక్షాలు, హైదరాబాద్‌ ఎంపీతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో అలైన్‌మెంట్‌ ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు ట్రాఫిక్‌ పరంగా బాటిల్‌నెక్‌లుగా మారకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌ను మా మార్గాల్లో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ శివానంద నింబార్గి పాల్గొన్నారు.
 
ప్రయాణికుల కోసం స్మార్ట్‌యాప్‌..
మెట్రో స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ఎలక్ట్రిక్‌ బస్సులు లేదా క్యాబ్‌ల్లో వెళ్లాలనుకుంటే.. తమ గమ్యం ఎంత దూరంలో ఉంది? మినీ బస్సు లేదా క్యాబ్‌లో ప్రయాణిస్తే ఎంత చార్జీ అవుతుంది? అన్న వివరాలను తెలుసుకునేందుకు స్మార్ట్‌ యాప్‌ను రూపొందిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే మినీ బస్సులు, క్యాబ్‌ సర్వీసులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ ట్యాగ్‌తో అనుసంధానిస్తామన్నారు. స్మార్ట్‌ యాప్‌తో ఎండ్‌టుఎండ్‌(ఒక గమ్యం నుంచి చివరి గమ్యం) వరకు ప్రయాణం సులభతరం కానుందన్నారు.
 
మెట్రో స్టేషన్ల నుంచి 20 సీట్ల మినీ బస్సులు..
మెట్రో స్టేషన్లకు 3 నుంచి 4 కి.మీ. దూరంలో ఉన్న కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు వీలుగా 20 సీట్ల మినీ ఎలక్ట్రిక్‌ బస్సులు నిరంతరం రాకపోకలు సాగిస్తాయని కేటీఆర్‌ తెలిపారు. ఎన్ని బస్సులు నడపాలన్న అంశంపై త్వరలో స్పష్టత రానుందని, ఫీడర్‌ బస్సులతో కాలుష్యం, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ బస్సులు మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న బస్‌బేల్లో నిలిచి ఉంటాయన్నారు.
 
పాతనగర మెట్రో మార్గాన్ని ఖరారు చేస్తాం..
ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో.. పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్‌పై వివిధ రాజకీయ పక్షాలు, హైదరాబాద్‌ ఎంపీతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో అలైన్‌మెంట్‌ ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని కేటీఆర్‌ స్పష్టంచేశారు.  
 
త్వరలో నూతన పార్కింగ్‌ పాలసీ..

మూడు మెట్రో కారిడార్ల పరిధిలో 34 చోట్ల పార్కింగ్, మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నామని కేటీఆర్‌ చెప్పారు. నవంబర్‌ చివరి వారంలోగా అవకాశం ఉన్న చోట పార్కింగ్‌ వసతులు కల్పిస్తామని, మిగతా చోట్ల వసతుల కల్పనకు ఏడాది సమయం పడుతుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులతో కలసి న్యూయార్క్‌ తరహాలో పీపీపీ విధానంలో నూతన పార్కింగ్‌ పాలసీని ఖరారు చేస్తామన్నారు. పార్కింగ్‌ ఏర్పాట్లకు ప్రైవేటు భవనాలు, ఖాళీస్థలాల యజమానులు ముందుకొస్తే వారికీ నికర ఆదాయం వచ్చేలా పార్కింగ్‌ పాలసీని ప్రకటిస్తామన్నారు.  
 
రెండో దశపై కేబినెట్‌ నిర్ణయమే తరువాయి..

మెట్రో రెండోదశపై జపాన్‌ రాజధాని టోక్యోలో అమల్లో ఉన్న విధానంపై మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం అధ్యయనం జరిపి ఆర్థిక వనరుల సమీకరణ, సాంకేతిక, ప్రణాళికాపరమైన అంశాలపై కసరత్తు పూర్తి చేసిందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన తర్వాత రెండో దశ ప్రాజెక్టు వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top