సాహిత్య భీష్ముడికి డాక్టరేట్

సాహిత్య భీష్ముడికి డాక్టరేట్ - Sakshi


పండిత కవిగా, ప్రముఖ పరిశోధకులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తికి గౌరవ డాక్టరేట్ లభించింది. సాహితీరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆయనకు గౌరవ పురస్కారం అందజేసింది. పాలమూరు జిల్లా సాహితీవనంలో కలికితురాయిగా, సాహిత్య భీష్ముడిగా పేరొందిన ఆయన చిన్నతనం నుంచి పేదరికాన్ని అనుభవిస్తూనే అంచెలంచెలుగా ఎదిగి సాహితీ రంగానికి వన్నెతెచ్చారు.                                   

 

నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఈ సాహిత్య భీష్ముడు 84ఏళ్ల పడిలో ఉన్నా నేటికీ కలం కదిలించనిదే పొద్దుగుంకనివ్వడు. నిరంతర పరిశోధకుడిగా ఉంటూ ఎన్నో రచనలు చేసిన కపిలవాయి సాహితీ అభిమానులకు, ఎందరో విద్యార్థులకు గురువుగా మారారు. పాలమూరు దేవాలయాల చరిత్ర, శాసనాలు, మరెన్నో సాహిత్య అంగాలను పరిశోధన చేసి పుస్తకరూపం ఇచ్చిన ఆయన నడిచే గ్రంథాలయంగా మారారు.

 

ఆయన పై పరిశోధనలు చేసి ఎందరో ఎంఫిల్ సాధిం చారు. పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వంగా చరిత్రకారులు కపిలవాయిని విశ్లేషిస్తారు. 14సంవత్సరాల చిరుప్రాయంలోనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన కపిలవాయి పద్యం, గద్యం, వచన  కవితలు, గేయాలు, నాటకాలు, కథలు, నవలలు, సంకీర్తనలు, హరికథలు, చారిత్రక కావ్యాలు, వ్యాఖ్యానాలు, చిత్రకవిత్వం, పరిష్కరణాలు, ద్విపదాలు, ఉదాహరణ ప్రక్రియలు లాంటి దాదాపు 80వరకు రచించారు. తాళపత్ర గ్రంథ సేకరణ, విశ్లేషణలో కూడా ఆయన నేర్పరి.

 

సన్మానాలు.. పురస్కారాలు

కపిలవాయి ఎన్నో బిరుదులు, అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. కవితా కళానిధి, పరిశోధక పంచానన, కళాకేసరి లాంటి బిరుదులు ఆయన కృషితో లభించిన వాటిలో కొన్ని. దివంగత ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోపాటు గవర్నర్లు, ప్రముఖ కళా వేదికలు, సాహిత్య సంస్థల నుంచి సన్మానాలు అందుకున్నారు.

 

కపిలవాయి రచనలు

భాగవత కథాతత్వం, ఆలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, శ్రీ మత్ప్రతాపరిగి ఖండం, కుటుంబగీత, మాంగళ్య శాస్త్రం, దుర్గా భర్గా శతకాలు, ఆర్యా శతకం, స్వర్ణ శకలాలు, గీతాచతుష్పదం, రుధ్రాధ్యాయం, యోగాసక్తా పరిణయం,  యయాతి చరిత్రలతోపాటు మరో 70 కావ్యాలను, సుమారు వందకుపైగా పరిశోధనలు, రచనలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top