కిక్కు పెంచేద్దాం

కిక్కు పెంచేద్దాం


- రాష్ట్రంలో వైన్‌షాపుల పెంపునకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన

- 3,500 షాపుల ఏర్పాటుతో మరింత ఆదాయం

- ప్రతి జిల్లాలో వందకుపైగా కొత్తవి ఏర్పాటు

- గుడుంబాను అరికట్టేందుకు చౌక మద్యం విక్రయాలు

- ముఖ్యమంత్రి ఆమోదిస్తే జూలై నుంచి అమలు

 

సాక్షి, హైదరాబాద్:
జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం పావులు కదుపుతోంది. బెల్టుషాపులను నిరోధించడం, ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మూడున్నర కోట్ల రాష్ట్ర జనాభాకు 10 వేల మందికి ఒక దుకాణం చొప్పున ఏకంగా 3,500 మద్యం దుకాణాలకు ఈసారి అనుమతివ్వాలని ఆబ్కారీ శాఖ చేసిన ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంగీకారమే మిగిలింది.



రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 దుకాణాలకు అనుమతి ఉంది. వీటిలోనూ రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో లెసైన్స్ ఫీజు అధికంగా ఉన్న కారణంగా వంద దుకాణాలను మద్యం వ్యాపారులెవరూ తీసుకోలేదు. కాగా, జులై 1 నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్న కొత్త మద్య విధానంలో భాగంగా దుకాణాల సంఖ్యను 3,500కు పెంచాలని, తద్వారా మద్యం అమ్మకాలను పెంచుకోవడంతో పాటు లెసైన్స్ ఫీజుల రూపంలో అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రతి జిల్లాలో వందకుపైగా కొత్త షాపులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో మంత్రి టి. పద్మారావుగౌడ్‌తో ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ తాజాగా సమావేశమై నూతన మద్యం విధానం విధివిధానాలను వివరించారు.



లెసైన్స్ ఫీజుల్లో మార్పులు

రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ప్రస్తుతం ఆరు స్లాబుల్లో అనుమతులిస్తున్నారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లెసైన్స్ ఫీజు రూ.3.25 లక్షలుగా ఉంది. 10 వేల నుంచి 50 వేల జనాభా గల ప్రాంతాల్లో రూ. 34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ. 42 లక్షలు, 3-5 లక్షల జనాభా ఉంటే రూ.46 లక్షలు, 5-20 లక్షల జనాభాకు రూ. 68 లక్షలు, 20 లక్షలకు మించిన జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 90 లక్షలను లెసైన్స్ ఫీజుగా వసూలు చేస్తున్నారు.



అయితే 10 వేల జనాభా లోపున్న ప్రాంతాల కేటగిరీలో కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే తప్ప ఎక్కడా మద్యం దుకాణాలు లేవు. గ్రామాల్లో వైన్‌షాపునకు అనుమతిచ్చేటప్పుడు దాని చుట్టుపక్కల గ్రామాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. ఇప్పుడు ప్రతి 10 వేల జనాభాకు ఓ వైన్‌షాప్ ప్రాతిపదికన అనుమతులిస్తే లెసైన్స్ ఫీజుల్లోనూ మార్పులు తప్పనిసరి. జనాభా ప్రాతిపదికన దుకాణాల ఏర్పాటు వల్ల గ్రామాలు, బస్తీల్లో బెల్టుషాపుల బెడద కూడా తీరుతుందని ఎక్సైజ్ శాఖ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు సమాచారం.



రూ. 40లోపే 180ఎంఎల్ మందు

రాష్ట్రంలో ఏరులై పారుతున్న నాటుసారా(గుడుంబా)ను అరికట్టాలంటే సారాయి తరహాలో చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి చౌకమద్యంపై అధ్యయనం చేశారు. ఆ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అమ్ముడవుతున్న ‘దేశీ దారూ’ తరహాలో వైన్‌షాపుల్లోనే చౌక మద్యాన్ని విక్రయించాలని, తద్వారా కొంత రెవెన్యూ నష్టపోయినా గుడుంబాను అరికట్టవచ్చని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడింది. దీనికి ప్రభుత్వం కూడా ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే వచ్చే జులై నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top